రుద్రంగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

  • విప్​ ఆది శ్రీనివాస్‌ 

చందుర్తి/కోరుట్ల, వెలుగు: తన స్వగ్రామం రుద్రంగితోపాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రుద్రంగి మండల కేంద్రంతోపాటు ఉమ్మడి మానాల పరిధిలో రూ. 2.03 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి గురువారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం, ప్రోత్సాహంతో రుద్రంగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.1.27కోట్లతో మండలకేంద్రంలో మెయిన్ రోడ్డు వెంట సైడ్ కాలువను నిర్మించునున్నట్లు చెప్పారు. రూ. కోటి 50 లక్షలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్‌ వరకు సీసీ రోడ్డు మంజూరు చేసినట్లు చెప్పారు. 

రుద్రంగివాసుల చిరకాల కోరిక ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికే భూమి పూజ చేసుకున్నామని, పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అంతకుముందు కథలాపూర్‌‌ మండలం గంభీర్‌‌పూర్‌‌లో గుంటుక పరశరాములు ఇటీవల చనిపోగా కుటుంబసభ్యులను విప్‌ పరామర్శించారు. అనంతరం గ్రామ కూడలి వద్ద హోటల్‌లో చాయ్‌ తాగుతూ కాంగ్రెస్‌ లీడర్లు, ప్రజలతో మాట్లాడారు. కలెక్టర్‌‌ మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్‌ మానాల మోహన్ రెడ్డి, డీఆర్‌‌డీవో శేషాద్రి, ఈఈ సుదర్శన్ రెడ్డి, డీఈ పవన కుమారి, ఎంపీడీవో నటరాజ్, తహసీల్దార్​శ్రీలత, ఏఈ మనోహర్ పాల్గొన్నారు.