- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : రాజకీయాల్లో పదవులకే వీడ్కోలు తప్ప.. ప్రజాసేవకు కాదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్టలో మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆదివారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రజాసేవ చేయాలంటే పదవులు అవసరం లేదని, సేవ చేయాలనే సంకల్పం ఉంటే సరిపోతుందన్నారు. కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్మన్ సహా పాలకవర్గ సభ్యులు చేసిన కృషి మరువలేనిదని గుర్తుచేశారు.
కొత్త పాలకవర్గం వచ్చే వరకు తామే కౌన్సిలర్లుగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్యా మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుధాహేమేందర్ గౌడ్, కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.