గవర్నర్ ఇచ్చినప్రాసిక్యూషన్ అనుమతి
లేఖపై కేబినెట్లో చర్చ
లెటర్‌ను ఏసీబీకి పంపిన సీఎస్ ఒకట్రెండు రోజుల్లోనే విచారణ
స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, మరో ఇద్దరు ఆఫీసర్లపై కూడా..
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ –కార్ల రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది. ఆయనను ప్రాసిక్యూషన్చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖపై సోమవారం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంక్వైరీపై నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే సీఎస్ శాంతికుమారి.. గవర్నర్ నుంచి వచ్చిన పర్మిషన్ లెటర్‌ను ఏసీబీకి అందజేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లోనే కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తున్నది. ఫార్ములా ఈ – రేస్ కేసులో ఏజెన్సీకి డబ్బులు చెల్లించిన టైంలో మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్‌గా ఉన్న అర్వింద్ కుమార్‌ను కూడా ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ఏజెన్సీకి సైతం నోటీసులు ఇచ్చి.. కేసులో భాగం చేయనున్నట్లు తెలిసింది.
పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ
ఈ కేసులో కేటీఆర్ పాత్రపై పక్కా ఆధారాలను సేకరించిన ఏసీబీ.. ఆయనను ఎంక్వైరీకి పిలవాలని ఇప్పటికే భావించింది. కానీ, కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో విచారణకు అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు ఇటీవలే అనుమతి ఇచ్చారు. తాజాగా అనుమతి లేఖ కూడా అందడంతో కేటీఆర్‌ను ఎంక్వైరీకి పిలిచేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలను
సేకరించిన ఏసీబీ అధికారులు.. విచారణ సందర్భంగానే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఫార్ములా ఈ–రేస్‌లో ఏం జరిగింది ?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సీజన్ 9 ఫార్ములా ఈ కార్ల రేస్‌తో పాటు నిర్వహించాలని భావించిన సీజన్ 10 ఫార్ములా ఈ–రేస్‌కు నాటి రాష్ట్ర కేబినెట్‌తో పాటు నాటి సీఎం ఆమోదం లేదు. సీజన్ 9 నిర్వహణకు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. స్టాల్స్, ప్రచారం, సీటింగ్, వీధిదీపాల లాంటి వాటికోసం ‘నెక్ట్స్‌జెన్ గ్రీన్ కో’ అనే ప్రైవేటు సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ఇంకో రూ.30 కోట్లను ‘హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్’ ఖర్చు పెట్టింది. సీజన్ 9లో నాటి రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో (నెక్ట్స్ జెన్), ఫార్ములా– ఈ (ఎఫ్ఈఓ) ఉన్నాయి. ఈ సీజన్లో నాటి రాష్ట్ర ప్రభుత్వం/ హెచ్ఎండీఏ కేవలం ఫెసిలిటేటర్‌గానే ఉంది.
ఫెసిలిటేటర్ గా ఉన్న ప్రభుత్వ పాత్ర.. కేవలం ఏర్పాట్లకు సహకరించడం మాత్రమే! లాభనష్టాలతో సర్కారుకు ఎలాంటి సంబంధం లేదు. ఫార్ములా ఈ–రేస్‌ను ప్రమోట్ చేసిన గ్రీన్కోకు సీజన్ 9లో చాలా నష్టం వచ్చింది. దీంతో ప్రైవేట్ ప్రమోటర్ గా ఉన్న గ్రీన్కోను సీజన్ 10 నుంచి తప్పించి ఫార్ములా ఈ(ఎఫ్ఈఓ)తో ఒప్పందం చేసుకున్నారు. ఇక సీజన్ 10కు సంబంధించి ఫార్ములా -ఈ రేస్ అగ్రిమెంట్‌కు ముందే అదీ ఎన్నికల కోడ్అమలులో ఉన్న సమయంలో అక్టోబర్ 2023న రూ.55 కోట్లు హెచ్ఎండీఏ చెల్లించింది. అది కూడా విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతరత్రా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే చెల్లింపులు చేశారు. ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీ లేదా కంపెనీలతో ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి.
ALSO READ : ఏ బాంబు పేలుతుందో కేటీఆర్కు త్వరలో తెలుస్తుంది: మంత్రి పొంగులేటి
కానీ, సీజన్ 10 విషయంలో ఒప్పందం కంటే ముందే ఫండ్స్చెల్లించేశారు. నిధులు పంపిన 18 రోజులకు అదీ ఎన్నికల కోడ్ టైంలో ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. ఈ ఒప్పందం వల్ల హెచ్ఎండీఏ(రాష్ట్ర ప్రభుత్వం) పై రూ.200 కోట్ల భారం పడింది. న్యాయ వివాదాలు వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలనే నిబంధన ఉంది. ఎఫ్ఈఓ (ఫార్ములా-ఈ) వ్యక్తులెవరూ సెక్రెటేరియెట్కు రాలేదు. ముఖాముఖి చర్చలు కూడా జరగలేదు.
చర్చలన్నీ ఈ–మెయిల్ ద్వారానే జరిగాయి. దీంతో విదేశీ కంపెనీకి వెళ్లిన ప్రభుత్వ సొమ్ము రూ.55 కోట్లను అప్పటి స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ చెల్లించాలంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆయనకు నోటీసులు పంపింది. కాగా, ఈ విషయంలో తన పాత్ర ఏమీ లేదని.. అప్పటి మంత్రి కేటీఆర్ చెప్తేనే చేశానని అర్వింద్‌కుమార్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కోసం ఏసీబీకి ఆదేశించింది.