
- గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
చౌటుప్పల్, వెలుగు : ప్రపంచంతో పోటీపడేవిధంగా విద్యార్థులు నాలెడ్జ్ పెంచుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. శనివారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని అశోక ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్లోబల్ దిగ్గజాలైన సుందర్ పిచాయ్, నారాయణమూర్తి లాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్య అనేది ఆయుధం లాంటిదని, చదువుతోనే ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపారు.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో ప్రపంచం దూసుకెళ్తోందని, అశోక ఇంజినీరింగ్ కాలేజీలో ఏఐ బోధించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు గోల్డ్ మెడల్, సర్టిఫికెట్లను అందజేశారు. అంతకుముందు నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అశోక్, ఇరాన్ కాన్సుల్ జనరల్ మహది షరోకి, డెలాయిట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.