హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 4,61,806 మంది పట్టభద్ర ఓటర్లున్నారు.
వీరిలో పురుషులు 287007 మంది, మహిళలు 174794 మంది కాగా ఇతరులు ఐదుగురు ఉన్నారు. మూడు పార్టీలు ఈ స్థానంలో పాగా వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. వరంగల్-నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలవడం కాంగ్రెస్‌కు ఎంత ఆవశ్యకమో.. బీఆర్‌ఎస్‌కు కూడా అంతే. అసలు ఈ ఎన్నిక వచ్చిందే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో..! సో.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం బీఆర్‌ఎస్‌కు ప్రెస్టేజీ ఇష్యూగా మారింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ తరఫున 12 జిల్లాల పరిధిలో పట్టభద్రుల సమావేశాలు నిర్వహించి తీన్మార్ మల్లన్న గెలుపుకోసం మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలనే నినాదాన్ని రెండు పార్టీలు అందుకున్నాయి. కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడిగా నిరుద్యోగులకు సుపరిచితుడైన పాలకూరి అశోక్ కుమార్, ఇటీవలే కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన బక్క జడ్సన్ ప్రచారం చేశారు. మొత్తానికి ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయి. పెద్దల సభలో పై చేయి సాధించాలని మూడు పార్టీలు పంతం మీదున్నాయి. మరి పట్టభద్రుల తీర్పు ఎటు అన్నది చర్చగా మారిందిప్పుడు.
జిల్లా పోలింగ్ కేంద్రాలు ఓటర్ల సంఖ్య
సిద్దిపేట 5 4671
జనగాం 27 23320
హనుమకొండ 67 43483
వరంగల్ 59 43594
మహబూబాబాద్ 36 34759
ములుగు 17 10237
జయశంకర్ భూపాలపల్లి 16 12460
భద్రాద్రి కొత్తగూడెం 55 39898
ఖమ్మం 118 83606
యాదాద్రి భువనగిరి 37 33926
సూర్యాపేట 71 51293
నల్లగొండ 97 80559
605 4,61,806