నెమ్మదిగా ధాన్యం కొనుగోళ్లు

నెమ్మదిగా ధాన్యం కొనుగోళ్లు
  • తూకం వేసినా లారీలు రాక ఇబ్బంది
  • తక్కువ ధరకు ప్రైవేట్‌‌లో అమ్ముకుంటున్నరు 
  • ఆలస్యానికి నిరసనగా పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనలు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నెమ్మదిగా సాగుతోంది. వందల సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేసినా వడ్ల కాంటా లేట్ అవుతోంది. దీంతో  కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం పేరుకుపోతోంది.  రైతుల 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.  లారీలు రైస్ మిల్లుల వద్ద ఖాళీ కాకపోవడంతో...  సెంటర్ వద్ద తూకం వేసిన ధాన్యం తరలింపు నిలిచిపోతోంది. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో...

జిల్లాలో 4 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు పీఏసీఎస్​, ఐకేపీ, ఎఫ్​పీఎస్​ల ఆధ్వర్యంలో సన్నరకం వడ్ల కొనుగోలు కేంద్రాలు 92, దొడ్డురకం కొనుగోలు కేంద్రాలు 397 ఏర్పాటు చేశారు.   కేంద్రాలు ఏర్పాటు చేసినా వడ్ల తూకం చాలా ఆలస్యంగా మొదలైంది. ఇప్పటి వరకు సుమారు 8 వేల మంది రైతుల నుంచి దాదాపు 40 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో 50 శాతం వరకు మాత్రమే రైస్​ మిల్లులకు తరలించారు. మిల్లులకు వెళ్లిన లారీలు మూడు నాలుగు రోజుల వరకు ఖాళీ కావడం లేదు. ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది.  అనేక చోట్ల కేంద్రాల వద్ద, రోడ్ల మీద పెద్ద మొత్తంలో ధాన్యం పేరుకుపోయింది. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు.   

సంగారెడ్డి జిల్లాలో...

జిల్లాలో వానాకాలం సీజన్ కు రైతులు 1.28 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో సివిల్ సప్లయ్ ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని  కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని 211 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు  రైతుల నుంచి 32 కోట్ల విలువగల 13,650 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు మందకొడిగా  జరుగుతున్నాయి. మొదట మిల్లుల ఆలాట్ మెంట్ ఆలస్యం కాగా ఆ తర్వాత తేమ నిబంధనల కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. 

కొనుగోళ్లు రోజుల తరబడి ఆలస్యం అవుతుండడంతో  రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకే  ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి వస్తోంది.సిద్దిపేట జిల్లాలో 8 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిలో  సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో  4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని 419 సెంటర్లను ఏర్పాటు చేశారు. 

ఇప్పటివరకు జిల్లాలో 6,584 మంది రైతుల నుంచి  రూ. 78 కోట్ల విలువైన  33,781 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల రోజులు దాటిని పది శాతం కొనుగోళ్లు జరగలేదు. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యాపారులు నేరుగా ఐకెపీ కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుపుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం అవుతోంది.

సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో 20  రోజుల క్రితం ఆర్భాటంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయడానికి కొర్రీలు పెట్టడంతో రోజుల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో  దిక్కు తోచని  రైతులు మద్దతు ధర కంటే 200 రూపాయలకు తక్కువగా  ప్రైవేటుకు తమ ధాన్నాన్ని  అమ్ముకుని వెళ్లిపోయారు. మాచాపూర్ కొనుగోలు కేంద్రానికి  ధాన్యం వచ్చినా ఒక్క గింజను అక్కడ  కొనుగోలు చేయక పోవడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు ధాన్యం రాశులు కనిపించిన చోట ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడంతో ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది.

20 రోజులైతుంది ఇంకా కొంటలేరు

శనిగరం గ్రామంలో పది ఎకరాల్లో వరి సాగు చేసిన 288 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. 20 రోజుల కింద వడ్లను బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి  తెచ్చినా ఇంత వరకు కొనుగోలు చేయలేదు. నిబంధనల ప్రకారం తేమ, తాలు  లేకుండా చేసి రోజు వడ్ల కుప్పల వద్ద కాపలా కూర్చుంటున్నా. తన సరకును కొనుగోలు చేయడానికి మరో ఐదు రోజుల పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.  రైతు  కానవేణి రాజయ్య.