పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

  • ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు
  • జిల్లా, మండల స్థాయిలో అధికారులు, ఉద్యోగులకు శిక్షణ పూర్తి
  • పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితానే ప్రామాణికం
  • ఉమ్మడి జిల్లాలో 29,53,140 మంది ఓటర్లు
  • మూడు జిల్లాలో 1782కు పెరిగిన పంచాయతీల సంఖ్య

నల్గొండ, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వార్డులవారీగా ఓటరు జాబితా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, మండల స్థాయిలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఓటరు జాబితా ప్రిపరేషన్ గురించి శిక్షణ పూర్తిచేశారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో వార్డులవారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. 

పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని, ఆ ప్రకారంగానే వార్డులవారీగా ఓటర్లను విభజించాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులో పేర్కొంది. ఎంపీ ఎన్నికల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29,53,140 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 3,583 ఉన్నాయి. 

పెరిగిన గ్రామ పంచాయతీలు..

గతంతో పోలిస్తే మూడు జిల్లాల్లో గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. 1740 గ్రామ పంచాయతీలు ఉండగా, కొత్తగా ప్రభుత్వం గెజిట్ ఇచ్చిన 42 పంచాయతీలతో కలిపి సంఖ్య 1782కు పెరిగింది. నల్గొండ జిల్లాలో 24 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయగా 868కి పెరిగింది. సూర్యాపేట జిల్లాలో 475 ఉండగా, కొత్తగా 11 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో 421 పంచాయతీలకు కొత్తగా 7 ఏర్పాటు చేయడంతో 428కి పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు ప్రతిపాదించిన వాటినే ఈ ప్రభుత్వం ఆమోదించింది. వీటిల్లో ఆవాస ప్రాంతాలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన వీటిని గుర్తించారు.  

పాత రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు..

ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారంగానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనుంది. కొత్త రిజర్వేషన్ల ప్రక్రియకు అనేక సమస్యలు అడ్డొస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. మరింత ఆలస్యమైతే కేంద్రం నిధులు రాకుండపోయే ప్రమాదం ఉంది. మరోవైపు బీసీ కులగణన అనేది సుదీర్ఘ ప్రక్రియ. కాబట్టి పాత రిజర్వేషన్లనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు సైతం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఇవీ..

నల్గొండ జిల్లా : చందంపేట మండలంలోని బండమీది తండా, నల్లచెల్మంల, అంజిపురం, బాలాజీతండా, దేవరకొండ మండలం గోలపల్లి, గిరిజానగర్ తండా, డిండి మండలం కటికబండ తండా, కొండమల్లేపల్లి మండలం పకీర్పురం, నేరేడుగొమ్మ మండలం సుద్దిబావి తండా, జోడుబావి తండా, పీఏపల్లి మండలం పోతిరెడ్డి పల్లి, సింగరాజుపల్లి, రంగారెడ్డిగూడెం, మదారిగూడెం, గడ్డమీది తండా, పిల్లిగుండ్ల తండా, మునుగోడు మండలం బీరెల్లిగూడెం, కాశివారిగూడెం, అనుమల మండలం కుపాస్పల్లి, కాశివారిగూడెం, గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం, పెద్దవూరలోని పుల్యాతండా, సింగారం, తిరుమలగిరిసాగర్ మండలం చెంచువాని తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.  

సూర్యాపేట జిల్లా : చివ్వెంల మండలం గుర్రంతండా, సూర్యాపేట మండలంలో రూప్లాతండా, దుబ్బతండా, అనంతగిరి మండలం అజ్మీరా తండా, నడిగూడెం మండలం ఎక్లాస్కాన్ పేట, నేరేడుచర్ల మండలంలో జానల్దిన్నె,  లాల్ లక్ష్మీపురం, మేళ్లచెర్వు మండలంలో దుబ్బతండా, జగ్గుతండా, గరిడేపల్లి మండలం కొండాయ్ గూడెం, మద్దిరాల మండలం గుట్ట కింద తండా ఉన్నాయి.  

యాదాద్రి జిల్లా : ఆలేరు మండలం బైరాన్నగర్, బొమ్మలరామారం మండలం ఖాజీపేట, మోటకొండూరు మండలం అబిద్నగర్, పెద్దబావి, తుర్కపల్లి మండలం గుజవానికుంట తండా, ఇందిరానగర్ నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి.