భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి బుధవారం సాయంత్రం దసరా మండపంలో విలాసోత్సవం వైభవంగా జరిగింది. దర్బారు సేవ అనంతరం పల్లకీలో సీతారాములను ఊరేగింపుగా దసరా మండపం వద్దకు తీసుకొచ్చారు. దారిపొడవునా భక్తులు స్వామికి మంగళనీరాజనాలు పలికారు. మండపంలో విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, వేదపారాయణాలు పారాయణం చేశాక స్వామికి ప్రత్యేకహారతులు సమర్పించారు.
భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు ఎస్ఎల్ కాంతారావు, సుబ్బరాజు, రమేశ్, ఎస్ఎన్వీ రామారావు తదితరులు పాల్గొని విలాసోత్సవం జరిపించారు. అంతకుముందు ఉదయం ప్రాకార మండపంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు సుప్రభాత సేవ అనంతరం పంచామృతాలతో అభిషేకం చేశారు. బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు.