భద్రాద్రిలో ఘనంగా వసంతోత్సవం

భద్రాద్రిలో ఘనంగా వసంతోత్సవం
  • భారీగా తరలివచ్చిన భక్తులు
  • ప్రారంభమైన సీతారాముల కల్యాణం పనులు

భద్రాచలం, వెలుగు : హోలీ సందర్భంగా శుక్రవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. వాల్మీకీ రామాయాణం ఆధారంగా సీతారాముల కల్యాణం జరిగిన రోజు, హోళిక అనేక రాక్షసిని సంహరించిన రోజు కావడంతో భద్రాద్రిలో వసంతోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ముందుగా ప్రధాన ఆలయంలోని ధ్రువమూర్తులకు, ఆంజనేయస్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి శాస్త్రోక్తంగా వసంతం చల్లిన అనంతరం భక్తులపై పసుపు నీళ్లు చల్లారు. 

ఉత్సవాల సందర్భంగా సాయంత్రం సీతారామలక్ష్మణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహించారు. అలాగే స్వామివారిని మేళతాళాల మధ్య బేడా మండపానికి తీసుకొచ్చి పూలతో అలంకరించిన ఊయలో ఉంచి డోలోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈవో రమాదేవి, స్థానాచార్యులు కేఈ స్థలసాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్‌‌ పాల్గొన్నారు.

తలంబ్రాల తయారీ షురూ

శ్రీరామనవమి రోజున భద్రాద్రి రామయ్య కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముందుగా సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత కల్యాణ కార్యక్రమంలో పాల్గొనే రుత్విక్కుల భార్యలు పసుపు దంచి, తలంబ్రాలను కలిపారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, గులాల్, అత్తర్, పన్నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. 

రామయ్య సేవలపై యాప్​: ఈవో రమాదేవి

భద్రాద్రి రామయ్యకు జరిగే సేవలు దేశ, విదేశాలతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు తెలిసేలా భద్రాచలం టెంపుల్‌‌ ఇన్‌‌ఫర్మేషన్‌‌ యాప్‌‌ను రూపొందించినట్లు ఈవో రమాదేవి చెప్పారు. శుక్రవారం చిత్రకూట మండపంలో జరిగిన కార్యక్రమంలో యాప్‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భద్రాచలం, పర్ణశాల, జటాయువు మండపం, శ్రీరామగిరి ఆలయాల సమాచారం, పూజలు, రుసుములు, పాపికొండల టూరిజం వివరాలు కూడా ఇందులో ఉంటాయన్నారు. భక్తులు యాప్‌‌ను వినియోగించుకోవాలని ఈవో సూచించారు.