
జూలూరుపాడు, వెలుగు : మండలంలోని కాకర్ల పాలగుట్ట రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కల్యాణం శుక్రవారం వైభవోపేతంగా సాగింది. స్వామి వారిని తెల్లవారుజామునుంచే భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచే స్వామి వారికి సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 9 గంటలకు స్వామివారి కల్యాణం కనుల పండువగా జరిగింది. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఢిల్లీ వేంకటేశ్వర్లు , అల్లాడి నరసింహారావు, పొన్నేకంటి సతీశ్, చావా వెంకట రామారావు, వెంకట నర్సయ్య, రమేశ్, సున్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అన్నపురెడ్డిపల్లిలోని బాలాజీ వేంకటేశుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. స్వామి వారిని తెల్లవారుజామునుంచే భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామికి గజ వాహన సేవ, అమ్మవారికి ఎదుర్కోలు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి కల్యాణం ఘనంగా నిర్వహించారు.