గ్రేటర్​ను వదలని గంజాయి మత్తు.. ఏటా సిటీకి 15 టన్నులకు పైగా స్మగ్లింగ్

 గ్రేటర్​ను వదలని గంజాయి మత్తు.. ఏటా సిటీకి 15 టన్నులకు పైగా స్మగ్లింగ్
  • ఏటా సిటీకి 15 టన్నులకు పైగా స్మగ్లింగ్
  • వైజాగ్‌‌ ఏజెన్సీ నుంచి తీసుకొస్తున్న స్మగ్లర్లు 
  • రూ.100కే 10 గ్రాములు దొరుకుతున్న పరిస్థితి
  • ఇక్కడి నుంచి మహారాష్ట్రకు సప్లై

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌ హైదరాబాద్​ను గంజాయి మత్తు వదలట్లేదు. పోలీసులు, ఎస్ఓటీ, టాస్క్​ఫోర్స్ ఎక్సైజ్​అధికారులు ఎన్నిరకాలుగా అడ్డుకుంటున్నా.. గంజాయి వస్తూనే ఉంది. స్లమ్‌‌ ఏరియాల్లోని అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, శివారు ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో పనిచేసే కార్మికులకు గంజాయి, హాష్ ఆయిల్​ను సప్లయ్ చేస్తున్నారు. లిక్కర్‌‌‌‌కు బానిసలైన యువతను టార్గెట్‌‌ చేసి వాట్సాప్‌‌ అడ్డాగా దందా చేస్తున్నారు. వైజాగ్​లోని ఏజెన్సీ ఏరియాల నుంచి హైదరాబాద్‌‌ మీదుగా మహారాష్ట్ర, బెంగళూరు‌‌కు తరలిస్తూనే సిటీలోని పెడ్లర్ల ద్వారా కస్టమర్లకు అందిస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా గంజా సిగరెట్లు, హాష్‌‌ ఆయిల్‌‌ బాటిల్స్‌‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఏటా సుమారు 15 టన్నులకు పైగా గంజాయిని సిటీకి తీసుకొస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇందులో 2 టన్నుల వరకు సిటీలో సేల్​చేస్తున్నట్లు గుర్తించారు.

అంతా గుడుంబా అమ్మినోళ్లే.. 

రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలు నిషేధించడంతో ఆ వ్యాపారం చేసిన వాళ్లే గంజాయి దందా మొదలుపెట్టారు. పోలీసులకు పట్టుబడుతున్న వారిలో వీరి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఎన్నిసార్లు పట్టుబడ్డా వీళ్లు గంజాయి దందాను మాత్రం వీడటం లేదు. వైజాగ్, ఒడిశా ఏజెన్సీల నుంచి తరలిస్తున్న దళారుల వద్ద తక్కువ ధరకు సరుకును కొంటున్నారు. దూల్​పేట, మంగళ్‌‌హాట్‌‌, ఫలక్‌‌నుమా, ఉప్పుగూడ, పురానాపుల్‌‌, జియాగూడ సహా స్లమ్‌‌ ఏరియాల్లో చిన్నచిన్న కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. కేవలం రూ.100కు10గ్రాముల గంజాయి సేల్ చేస్తున్నారు. వీటిని రెగ్యులర్ కస్టమర్లుకు చైన్ సిస్టమ్‌‌ ద్వారా సప్లయ్ చేస్తున్నారు. ఫుట్‌‌పాత్‌‌లు, రైల్వేస్టేషన్లు, బస్‌‌స్టేషన్ల వద్ద షెల్టర్‌‌‌‌ తీసుకునే వారికి సేల్ చేస్తున్నారు. హుస్సేన్‌‌సాగర్ పరిసర ప్రాంతాలు, పార్కుల సమీపంలో గంజాయి నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

హోల్​సేల్ సప్లయర్లే టార్గెట్..

సిటీలోని హోల్‌‌ సేల్‌‌ సప్లయర్లకు ఏపీ, మహారాష్ట్రకు చెందిన ముఠాలు గంజాయిని అందిస్తున్నాయి. వీరితోపాటు ఈజీ మనీ కోసం కొంతమంది యువత గంజాయి క్యారియర్లుగా పనిచేస్తున్నారు. కమీషన్లతో వైజాగ్‌‌ నుంచి హైదరాబాద్ ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్నారు. ఏటా సుమారు 2 టన్నులకు పైగా గంజాయిని సిటీకి సప్లై చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏజెన్సీలో రూ.2 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి, డిమాండ్ ను బట్టి ఇక్కడ కిలోను రూ.7 వేలకు అమ్ముతున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో మూడెంచెల క్యారియర్‌‌‌‌, ఏజెంట్లతో స్మగ్లింగ్​చేస్తున్నారు. 

గంధపు చెక్కల తరహాలో స్మగ్లింగ్..

సప్లయర్లు పోలీసుల తనిఖీలో పట్టుబడకుండా కార్లకు ప్రత్యేక సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ల తరహాలో గంజాయిని ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్నారు. లారీ డ్రైవర్ క్యాబిన్​వెనుక స్పెషల్ సెటప్, కార్లలో సీట్ల కింద, డోర్లు, కింది భాగంలో ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేసి గంజాయి ప్యాకెట్లను అందులో ఉంచుతున్నారు. కూరగాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, అరటి ఆకులు, విస్తరాకులు, పరుపుల మధ్య గంజాయిని పెట్టి ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చేస్తున్నారు. గంజాయి వాసన రాకుండా పాలిథిన్ కవర్లను వాటికి చుట్టేస్తున్నారు. గంజాయి ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్న వెహికల్స్‌‌ ముందు వెనుక పైలెటింగ్ నిర్వహిస్తున్నారు. కూలీలు, రెంటల్‌‌ కార్‌‌‌‌ డ్రైవర్లను గంజాయి క్యారియర్లుగా చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లల్లో ప్యాసింజర్లుగా ట్రావెల్‌‌ చేస్తూ సరుకును గమ్యస్థానాలకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, బస్‌‌స్టేషన్లకు పార్సిల్స్‌‌ ద్వారా గంజాయిని చేరుస్తున్నారు.

వైజాగ్​ ఏజెన్సీ నుంచే ఎక్కువగా.. 

వైజాగ్ ఏజెన్సీ ఏరియాల నుంచి గంజాయి వస్తోంది. విజయవాడ హైవే నుంచి అంబర్‌‌‌‌పేట ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ మీదుగా మహారాష్ట్ర, బెంగళూరుకు పెద్ద మొత్తంలో గంజాయి‌‌ తరలిస్తున్నారు. నిఘా పెట్టాం. గత సోమవారం రెండు గ్యాంగ్​లను అరెస్ట్ చేశాం. రూ.1.5 కోట్లు విలువ చేసే 380 కిలోల గంజాయి,4 కార్లు సీజ్ చేశాం.9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించాం. ఏజెంట్లు, క్యారియర్లపై ఫోకస్ పెట్టాం. వైజాగ్‌‌ ఏజెన్సీ ఏరియాల నుంచి వచ్చే సప్లయర్లను పక్కా సమాచారంతో పట్టుకుంటున్నాం.
- డీఎస్ చౌహాన్​, సీపీ, రాచకొండ