గ్రేటర్ వరంగల్ లో పార్కింగ్​ అస్తవ్యస్తం!

  • సిటీలో ట్రాఫిక్​ సమస్యకు కారణమవుతున్న బడా మాల్స్​, కమర్షియల్​ కాంప్లెక్సులు
  • సెల్లార్లను ఇతర అవసరాలకు వాడుతూ బండ్లన్నీ రోడ్ల మీదనే పార్కింగ్​
  • సగానికిపైగా రోడ్లను ఆక్రమిస్తున్న వాహనాలు
  • దారులు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బందులు
  • ట్రాఫిక్ కష్టాలను లైట్ తీసుకుంటున్న గ్రేటర్ ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో బడా మాల్స్, కమర్షియల్​కాంప్లెక్సులు ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి. మెయిన్​రోడ్లను ఆనుకుని ఉన్న చాలా కాంప్లెక్సులు వాహనాల పార్కింగ్​ వాడాల్సిన సెల్లార్లలో వివిధ షాపులు, ఆఫీసులు, ఆస్పత్రులు, ఇతర బిజినెస్​లకు వినియోగిస్తుండటంతో బండ్లన్నీ రోడ్ల మీదనే పెట్టాల్సి వస్తోంది. దీంతో రోడ్లు సగానికిపైగా వాహనాల పార్కింగ్ తోనే నిండి ఉండటంతో ట్రాఫిక్​ చిక్కులు తీవ్రమవుతున్నాయి. సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగిస్తూ ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న కాంప్లెక్సులపై చర్యలు చేపట్టాల్సిన గ్రేటర్  ఆఫీసర్లు మామూళ్లకు అలవాటు పడి లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రోడ్లపైనే బండ్లన్నీ..

వరంగల్ నగరంలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు ఉండగా, వెయ్యికి పైగా కమర్షియల్ కాంప్లెక్సులు, బడా మాల్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో హనుమకొండ పెట్రోల్​పంపు, చౌరస్తా, బాలసముద్రం, వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్ తదితర ఏరియాల్లోని కాంప్లెక్సులు సెల్లార్లోనే రూమ్ లు కట్టి బిజినెస్​నడిపిస్తున్నాయి. దీంతో వెహికల్​పార్కింగ్ కు స్థలం లేక అవసరాల నిమిత్తం వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్క్​చేయాల్సి వస్తోంది. అవి కూడా మెయిన్​రోడ్లను సగానికిపైగా ఆక్రమిస్తుండటంతో మిగతా వాహనాలకు ట్రాఫిక్​ఇబ్బందులు తప్పడం లేదు. 

లైట్​తీసుకుంటున్న గ్రేటర్​ ఆఫీసర్లు..

పార్కింగ్ కు వాడాల్సిన సెల్లార్లను ఇతర కమర్షియల్​అవసరాలకు వినియోగిస్తున్నా గ్రేటర్​వరంగల్ ఆఫీసర్లు లైట్​తీసుకుంటున్నారు. ఫలితంగా నగరంలో ట్రాఫిక్​ చిక్కులకు కారణమవుతున్నారు. ట్రాఫిక్​ సమస్య తీవ్రమైన నేపథ్యంలో దాదాపు నాలుగేండ్ల కిందట నగరంలోని సెల్లార్లపై అప్పటి ఆఫీసర్లు స్పెషల్​డ్రైవ్​నిర్వహించారు. ఇందులో వరంగల్ లోని విక్టర్ కాంప్లెక్స్, సీతారామ, నిర్మలా మాల్​తోపాటు వివిధ హాస్పిటళ్లకు సంబంధించి సెల్లార్లలో అక్రమంగా నిర్మించిన రూమ్​లను తొలగించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ సెల్లార్లలో అక్రమ నిర్మాణాల తొలగింపు విషయాన్ని గాలికొదిలేశారు. 

దీంతో నగరంలోని వందలాది మాల్స్, కాంప్లెక్సుల సెల్లార్లలో యథేచ్ఛగా బిజినెస్​లు నడుస్తున్నాయి. కాజీపేట నుంచి వరంగల్ కు ఏ మెయిన్​రోడ్డు చూసినా వెహికిల్స్​పార్కింగ్​ప్లేసులుగానే కనిపిస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్​సమస్యలు తలెత్తి పోలీస్​ఆఫీసర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో పాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. ఇప్పటికైనా గ్రేటర్​ సిటీ పరిధిలోని సెల్లార్లను పార్కింగ్ అవసరాలకు వినియోగంలోకి తెచ్చి, బండ్లను రోడ్లపై పార్క్​చేయకుండా చూడాలని ప్రజలు డిమాండ్​చేస్తున్నారు.

ALSO READ : ‘రైతు పండుగ’ సందడి .. పాలమూరులో నిర్వహించిన సదస్సులో ఆకట్టుకున్న స్టాల్స్

ఇది హనుమకొండ బస్టాండ్​సమీపంలోని కుడా కాంప్లెక్స్​జంక్షన్. ఈ కాంప్లెక్సుకు సెల్లార్ ఉన్నా ఇంత వరకు దానిని వినియోగించడం లేదు. కాంప్లెక్స్ లోని వివిధ షాపులు, ఆస్పత్రులకు వచ్చే బైకులు, కార్లు, అంబులెన్సు వాహనాలను రోడ్డు నడిమధ్య వరకు పార్క్​చేస్తున్నారు. అవతలి వైపు రోడ్డుపై కూడా ప్రైవేటు వెహికిల్స్ పార్క్ చేసి ఉంటుండటంతో ఈ జంక్షన్ లో తరచూ తీవ్ర ట్రాఫిక్​ జామ్​అవుతుంది. దీంతో నిత్యం అక్కడ ట్రాఫిక్​ సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కేవలం ఇదొక్కడే కాదు.. నగరంలోని చాలా కాంప్లెక్సుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది.