
- ఉమ్మడి జిల్లాలో వట్టిపోతున్న బోరుబావులులు
- ఇప్పుడే ఈ పరిస్థితేంటన్న ఆందోళన
- చేసేదిలేక పంటలను పశువులకు మేపుతున్న రైతు
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/ చంద్రుగొండ, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండలకు భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. బోరుబావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఎండిపోయిన పంటను పశువులకు మేపుతున్నారు.
ఎక్కడ.. ఏ పరిస్థితి..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో సరాసరి 8.66 మీటర్ల డెప్త్లో నీళ్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.45 మీటర్ల వరకు భూ గర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలోనే అత్యధికంగా కొత్తగూడెంలో 29.87 మీటర్ల లోతులో వాటర్ లెవల్స్ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో జనవరిలో సగటున 4.49 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు, ఫిబ్రవరి నెలాఖరు నాటికి 4.99 మీటర్ల లోతుకు చేరింది. గతేడాది ఫిబ్రవరిలో 6.22 మీటర్లతో పోల్చితే ఈసారి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా, మార్చిలోనే ఎండలు విపరీతంగా పెరగడంతో వేగంగా నీటిమట్టం పడిపోయే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం లక్ష్మీదేవిపల్లి, కరకగూడెం, ముల్కలపల్లి, టేకులపల్లి, ఆళ్లపల్లి, పినపాక, కొత్తగూడెం, గుండాల, ఖమ్మం అర్బన్, మధిర, వైరా మండలాల్లో భూగర్భ జలాలు లోతుకు పడి పోయాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో యాసంగిలో మొత్తం 1.16 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ఇక్కడ ఎక్కువగా బోర్ల కిందనే పంటలు సాగు చేస్తారు. ఇప్పుడు క్రమంగా భూగర్భ జలాలు పడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ సాగర్ కింద చివరి ఆయకట్టు ప్రాంతంలో కొన్ని పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
బోరులో నీళ్లు తగ్గాయి..
రెండు ఎకరాల్లో వరి నాటాను. బోరులో నీళ్లు తగ్గుతున్నాయి. పొలం మొత్తం నీళ్లు సరిపోవడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు ముదురితే పంట పరిస్థితి ఏంటోనని భయంగాఉంది. నల్లపోగు వెంకటేశ్వర్లు, రైతు, చంద్రుగొండ మండలం
సగం పంట ఎండుతోంది..
నాలుగు ఎకరాల్లో వరి నాటాను. బోర్లు సరిగా నీళ్లు పోయకపోవడంతో రెండు ఎకరాలకు అరకొరగా నీళ్లు పెడుతున్నాను. సగం పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. దుక్కులు, విత్తనాలు, కూలీలు, ఎరువులు ఇతరత్రా వాటికి ఎకరానికిరూ. 30వేలు పెట్టుబడి పెట్టా. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. - జి. రాఘవులు, రైతు, దామరచర్ల