అన్నదాతకు నీటిగోస అడుగంటుతున్న జలం.. ఎండిపోతున్న పొలాలు

అన్నదాతకు నీటిగోస అడుగంటుతున్న జలం.. ఎండిపోతున్న పొలాలు

మెదక్/నిజాంపేట్, వెలుగు: జిల్లాలో భూగర్భ జలమట్టాలు రోజురోజుకి దిగువకు పడిపోతున్నాయి. ఇది యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి తడులు అందక వరి పొలాలు బీటలు వారుతున్నాయి. పలు చోట్ల పంట ఎండిపోతోంది. మార్చి మొదట్లోనే ఎండల తీవ్రత పెరిగి, బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో భూగర్భజలాలు  జనవరిలో 10.94 మీటర్ల లోతులో ఉండగా, ఫిబ్రవరిలో 13.25 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాది 2024 ఫిబ్రవరిలో 12.98 మీటర్ల లోతులో ఉండగా ఈ సారి ఫిబ్రవరిలో 13.25 మీటర్ల లోతుకు చేరాయి. జిల్లాలో మూడు మండలాల్లో పాపన్నపేట, హవేలీ ఘనపూర్, మనోహరాబాద్ మండలాల్లో నీటి మట్టం 5 నుంచి 10 మీటర్ల లోతులో ఉన్నాయి. 17 మండలాల్లో శివ్వంపేట, టేక్మాల్, తూప్రాన్, అల్లదుర్గం, చేగుంట, చిలప్ చెడ్, కొల్చారం, కౌడిపల్లి, మాసాయిపేట, నర్సాపూర్, నిజాంపేట్, రామాయంపేట, రేగోడ్, మెదక్, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి మండలాల్లో నీటి మట్టం 10 నుంచి 20 మీటర్ల లోతులో ఉంది. నార్సింగి మండలంలో భూగర్భ జలమట్టం జిల్లాలోనే అత్యధికంగా 25.46 మీటర్ల లోతుకు చేరడం గమనార్హం. 

గ్యాప్ ఇస్తున్న బోర్లు..

భూగర్భ జలాలు దిగువకు పడిపోతుండడంతో మొన్నటి దాకా బాగా నీరు పోసిన వ్యవసాయ బోర్లు ఇప్పుడు తక్కువ పోస్తున్నాయి. చాలా బోర్లు గ్యాప్ ఇస్తున్నాయి. జిల్లాలో యాసంగి సీజన్ లో లక్ష ఎకరాలకు పైగా వరి పంట సాగైంది. భూగర్భ జల మట్టం దిగువకు పడిపోవడంతో బోర్ల ఆధారంగా యాసంగి సీజన్ లో సాగు చేసిన వరి పంటలకు నీటి తడులు అందక బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు నాన తంటాలు పడుతున్నారు. పలు చోట్ల పంటలు ఎండడంతో రైతులు పశువులను మేపుతున్నారు. కొన్ని చోట్ల మామిడి తోటలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో రైతులు ట్యాంకర్ లతో నీరు పెడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్,  మే లో పరిస్థితి ఎలా ఉంటుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బిగెడు వరి ఎండిపోయింది 

యాసంగిలో బిగెడు వరి నాటేసిన. ఎండలు ఇంకా ముదరక ముందే బోర్లు పొస్తలే. బోర్లలో నీళ్లు లేకపోవడంతో పొలం ఎండిపోయింది.  ఎండిపోయిన బిగెడు పొలం, మక్కలో జీవాలను ఇడిసిపెట్టి రోజుకు ఇంత మేపుతున్నా. - బాలయ్య, రైతు, చల్మెడ

ఐదెకరాలు ఎండిపోయింది 

యాసంగిలో ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేసినం. ఎండలు ఇంకా ముదరక ముందే గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయాయి. దీంతో  బోర్లెం పోయడం లేదు. తడులు అందక మేము సాగు చేసిన ఐదు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. వరి నాటు వేయడానికి పెట్టిన పెట్టుబడి మొత్తం మీద పడ్డది. గవర్నమెంట్ ఎండిపోయిన రైతుల పంట పొలాలను గుర్తించి ఏమైనా సాయం చేయాలి.- బాబు, రైతు, నగరం తండా

ట్యాంకర్ పెట్టి నీళ్లు పెడుతున్నా నాలుగు ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నా. ఒక్కసారిగా భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరు పోస్తలే. దీంతో మూడు కిలోమీటర్ల దూరం నుంచి రోజుకు ఆరు ట్యాంకర్ల నీరు తీసుకుని వచ్చి మామిడి తోటను పారబెడుతున్నా. అసలే పూత తక్కువ వచ్చింది. దీనికి తోడు నీరు లేకపోవడంతో పూత, పిందె రాలిపోతున్నాయి. అందుకని ఈ పని చేస్తున్నా. లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు.- బాజా బాబు, రైతు, చల్మెడ