గ్రూప్-3 ప్రశాంతం .. సెంటర్లను పరిశీలించిన అధికారులు

గ్రూప్-3 ప్రశాంతం .. సెంటర్లను పరిశీలించిన అధికారులు
  • నిమిషం నిబంధనతో ఇబ్బంది పడ్డ అభ్యర్థులు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/పాల్వంచ, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్​–3 ఎగ్జామ్స్​ ఫస్ట్​ డే ప్రశాంతంగా జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లోని 39 సెంటర్లలో  పరీక్షలు నిర్వహించారు. మొత్తం13,478 మంది ఎగ్జామ్​ రాయాల్సి ఉండగా, 7,238 మంది (53.51శాతం) మాత్రమే ఎగ్జామ్​కు హాజరయ్యారు. 6,244 మంది అభ్యర్థులు అబ్సెంట్​ అయ్యారు. ఎగ్జామ్​ సెంటర్లను కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్​రాజు వేర్వేరుగా పరిశీలించారు. 

ఉదయం 9.30 గంటలకు ఎగ్జామ్​ సెంటర్ల గేట్లను అధికారులు మూసివేశారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని పలు సెంటర్లలో ఒక్క నిమిషం నుంచి మూడు నిమిషాల్లో ఆలస్యంగా వచ్చిన 30 మందికి పైగా  అభ్యర్థులను అనుమతించలేదు. కాగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 87 కేంద్రాల్లో 27,984 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉన్నది. మొత్తం పరీక్షలకు ఎంత మంది అటెండ్ అయ్యారు అనే అంశాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.  కాగా పలు కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. 

హాల్ టికెట్ పై సరైన అడ్రస్​ లేక..

పాల్వంచలోని నెహ్రు నగర్ లో ఉన్న  బాలికల  డిగ్రీ విద్యార్థుల గురుకులం సెంటర్ లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు పరీక్ష సమయం ముగిసిన తర్వాత రావడంతో సిబ్బంది వారికి అనుమతి ఇవ్వలేదు. హాల్ టికెట్ లో పరీక్షా కేంద్రం పాల్వంచలో ఉన్నట్టు పేర్కొనలేదని, కేవలం జిల్లా పేరు మాత్రమే ఉండడంతో తాము కొత్తగూడెం వెళ్లి వాకబు చేశామని, అక్కడ పరీక్షా కేంద్రం లేదని తెలియడంతో తిరిగి పాల్వంచ వచ్చేవరకు ఆలస్యమైందని ఇల్లెందుకు చెందిన సారమ్మ అనే అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యతో ఐదుగురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. హాల్ టికెట్ లో సరైన అడ్రస్​ ఇవ్వకపోవడం వల్లే తాము నష్టపోయామని వారు వాపోయారు.