అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లు

అక్టోబర్ లో  జీఎస్టీ వసూళ్లు  రూ. 1.87 లక్షల కోట్లు
  •  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రికార్డుస్థాయి వసూళ్లు
  • ఇంతమొత్తం రావడం ఇది రెండోసారి
  • గత అక్టోబరులో రూ. 1.72 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి.  స్థూల జీఎస్టీ వసూళ్లు అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ అమ్మకాలు, మరింత మంది పన్ను పరిధిలోకి రావడంతో వసూళ్లు పెరిగాయని కేంద్రం తెలిపింది. ఇంత మొత్తం రావడం ఇప్పటి వరకు ఇది రెండోసారి. వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా ఎనిమిదో నెల. తాజా వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.33,821 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.41,864 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.99,111 కోట్లు, సెస్ రూ.12,550 కోట్లుగా ఉన్నాయి.  

శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం 8.9 శాతం పెరిగి రూ.1,87,346 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 2023లో వీటి విలువ రూ. 1.72 లక్షల కోట్లుగా ఉంది. 2024 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా రూ. 2.10 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. గత నెలలో, దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 10.6 శాతం పెరిగి రూ. 1.42 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 4 శాతం పెరిగి రూ.45,096 కోట్లకు చేరుకుంది.  ఈ నెలలో రూ.19,306 కోట్ల విలువైన రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జారీ అయ్యాయి. గత ఏడాది కాలంతో పోలిస్తే 18.2 శాతం వృద్ధి కనిపించింది.  రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.

కలసి వచ్చిన పండుగలు

 డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్​ మణి మాట్లాడుతూ, పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకాలు,  పెరిగిన పన్ను చెల్లింపుదారుల వల్ల జీఎస్టీ వసూళ్లు పుంజుకున్నట్లు తెలిపారు. దేశీయ సరఫరాలు బాగుండటంతో చాలా పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయంలో  9 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయన్నారు.  కొన్ని  చాలా చిన్న రాష్ట్రాలు సగటు కంటే తక్కువ పెరుగుదలను చూపించడం మాత్రం ఆందోళన కలిగించే విషయమని మణి అన్నారు.

ఈవై ట్యాక్స్​పార్ట్​నర్​ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ, నెలవారీ జీఎస్టీ వసూళ్లలో సింగిల్- డిజిట్ వృద్ధి ప్రతికూలతను సూచిస్తుందని,  వినియోగదారుల వ్యయం తగ్గుతోందని అన్నారు. పండుగల వల్ల  నవంబర్ కలెక్షన్లు బాగుంటాయని అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ఈసారి రూ.5,211 కోట్ల జీఎస్టీ వసూలయింది.