ముద్దలు కట్టిన అన్నం పెడుతున్నరు .. గురుకుల స్కూల్ విద్యార్థుల ఆవేదన

ముద్దలు కట్టిన అన్నం పెడుతున్నరు .. గురుకుల స్కూల్ విద్యార్థుల ఆవేదన

తిమ్మాపూర్, వెలుగు: సరిగా ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని, అది తింటే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలోని  మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు మంగళవారం మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. తమకు వారం రోజులుగా ముద్దలు కట్టిన, పాడైపోయిన అన్నం పెడుతున్నారని, దీంతో కొంతమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ పాలయ్యారన్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మంగళవారం స్కూల్‌‌‌‌‌‌‌‌ వద్దకు రాగా స్కూల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

అనంతరం తల్లిదండ్రుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధుల ఎదుట విద్యార్థులు వారం రోజులుగా ముద్దలు కట్టిన, పాడైపోయిన అన్నం పెడుతున్నారని, ఈ విషయం బయటకు చెప్పొద్దని స్కూల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది భయభ్రాంతులకు గురిచేశారని వాపోయారు. కాగా మీడియా ప్రతినిధులు గురుకులం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మీడియాకు అనుమతి లేదని ప్రిన్సిపాల్ అడ్డుకున్నాడు. బియ్యం విషయమై వివరణ కోరగా.. సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చిన సరైన బియ్యం పంపించడం లేదన్నారు.