గ్రేటర్‌‌లో ట్యాక్స్ వసూలు కావట్లే

 గ్రేటర్‌‌లో ట్యాక్స్ వసూలు కావట్లే
  • జీడబ్ల్యూఎంసీ  ప్రాపర్టీ ట్యాక్స్ రూ.117 కోట్ల 34 లక్షలు
  • వసూలు చేసింది కేవలం రూ. 48 కోట్ల 27 లక్షలు
  • పైనాన్షియల్ ఇయర్ ముగుస్తున్న సగం కూడా వసూలు కాని పన్నులు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ (జీడబ్ల్యూఎంసీ)లో  ట్యాక్స్ వసూళ్లు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది.  ఫైనాన్షియల్‍ ఇయర్‍ దగ్గర పడుతున్నా కొద్దీ సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉన్నతాధికారుల స్థాయిలో స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తున్నారు.  అయినా వసూలు చేయాల్సిన టార్గెట్‍లో సగం కంటే తక్కువగా కేవలం 41 శాతం మాత్రమే కావడంతో తలలు పట్టుకుంటున్నారు.

గతేడాది 60 శాతం..  ప్రస్తుతం 41 శాతం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు రూ.117  కోట్ల 34  లక్షలు ఆస్తి, నల్లా పన్నులు వసూలు చేయాల్సి ఉంది.  గడువు దగ్గరపడుతున్నా అధికారులు ఇప్పటివరకు రూ.48 కోట్ల 27 లక్షలు మాత్రమే వసూలు చేశారు.  డిసెంబర్‍, జనవరి నెలల్లో మున్సిపల్‍ ఆఫీసర్లు, సిబ్బంది ప్రభుత్వ పథకాలు, కుల గణనకు సంబంధించి సర్వేల్లో బిజీగా గడపడంతో పన్నుల వసూళ్లపై పెద్దగా ఫోకస్‍ పెట్టలేదు.  2023‌‌–24 ఏడాదికిగానూ బల్దియా టార్గెట్‍ రూ.97 కోట్ల 66 లక్షలు ఉండగా.. రూ.63 కోట్ల 96 లక్షలు వసూలు చేసి మొత్తంగా 60 శాతం ట్యాక్స్  వసూలు చేశారు. 

వసూళ్లపై స్పెషల్​ ఫోకస్‍ 

గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కమిషనర్‍గా ఐఏఎస్‍ అశ్విని తానాజీ వాఖడే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గతేడాది పన్నుల వసూళ్లను చూసిన ఆఫీసర్‍గా స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. టార్గెట్‍ మేరకు సకాలంలో పన్నులు వసూలు చేయని పక్షంలో చర్యలు తప్పవని ఆమె బల్దియా అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు.  దీంతో వరంగల్‍, హనుమకొండ, కాజీపేట పరిధిలోని ట్రై సిటీలో అడిషనల్‍ కమిషనర్‍ జోనా, డిప్యూటీ కమిషనర్లు రవీందర్‍,  ప్రసన్నరాణి, రాజేశ్వర్‍, డిస్ట్రిక్ట్ ట్యాక్స్  ఆఫీసర్‍ రామకృష్ణలతో కూడిన బృందం స్పెషల్‍ డ్రైవ్‍ పేరుతో పన్నులు వసూళ్లు చేస్తున్నారు. 

పెద్దోళ్ల బకాయిల జోలికి పోవట్లేదనే విమర్శ

జీడబ్ల్యూఎంసీ పరిధిలో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఇనిస్టిట్యూట్లు వేలాదిగా ఉన్నాయి. కాగా, పన్నుల వసూళ్లలో అధికారుల బృందం ఇలాంటివారిని వదిలి మిడిల్‍ క్లాస్‍ జనాలపై పడ్తున్నారనే విమర్శ ఉంది.  రెండు, మూడేండ్ల క్రితం అప్పటి ఆఫీసర్లు గ్రేటర్‍ మున్సిపల్‍ పరిధిలో రూ. కోట్లు, లక్షల్లో మొండి బకాయిదారుల జాబితాను రూపొందించేవారు.  వారికి రెడ్‍ నోటీసులు జారీ చేసేవారు. ఏఏ సంస్థ, హోటల్‍, కాలేజీలు వంటివి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంది.

ఎప్పటినుంచి కట్టట్లేదనే విషయాన్ని పేపర్‍ ప్రకటనతో పాటు భారీ ఫ్లెక్సీల రూపంలో బల్దియా కార్యాలయం ముందు, సిటీలో ప్రదర్శించేవారు. దీంతో అప్పటివరకు రాజకీయ ముసుగులో లేదంటే వారి సహకారంతో ట్యాక్స్ ఎగవేతకు పాల్పడేవారంతా బకాయిలు చెల్లించేవారు.  ఈసారి మాత్రం అధికారులు ఈ తరహా పెద్ద అమౌంట్లు వచ్చే మొండి బకాయిదారుల వైపు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.