
బాడీ బిల్డింగ్ పై యువకులు కలలు కంటుంటారు. జిమ్ కు వెళ్లి బాడీ పెంచుకుంటే చూడటానికి బాగుంటుందని యూత్ వెళ్తుంటారు. కొందరు ఫిట్ నెస్ కోసం, కొందరు మజిల్స్ కోసం జిమ్ కు వెళ్లటం సహజం. మరికొందరు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనాలని కూడా వెళ్తుంటారు. ఇలాంటి యువకుల సహజమైన కోరికను ఆసరాగా చేసుకుని జిమ్ ట్రైనర్లు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. కండలు త్వరగా వస్తాయని చెప్పి వివిధ పౌడర్లు, లిక్విడ్ లు ఇచ్చి డబ్బు చేసుకోవాలనే యావలో యువకుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.
శనివారం (ఏప్రిల్ 19) వరంగల్ జిల్లాలో స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్ శ్రవణ్ అరెస్ట్ చేశారు పోలీసులు. జిమ్ లో సోదాలు నిర్వహించి 20 వేల రూపాయల విలువైన స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
స్టెరాయిడ్ విక్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు ట్రైనర్ శ్రవణ్. లైసెన్స్ లేకుండా వైజాగ్ కు చెందిన మణికంఠ, ఆనంద్ ల దగ్గర ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఆన్ లైన్ లో ఆర్డర్ చస్తే కావాల్సిన సరుకును వెంటనే పంపిస్తారని దీని వెనుక ఉన్న వాళ్ల గురించి కూడా చెప్పేశాడు.
కండలు పెంచేందుకు స్టెరాయిడ్స్ వాడటం చాలా డేంజర్ అని చెబుతున్నారు పోలీసులు. స్టెరాయిడ్స్ తో బీపీ పెరిగి హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదకర స్టెరాయిడ్స్ విక్రయిస్తే కఠినచర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.