హైదరాబాద్, వెలుగు: చెడగొట్టు వానలతో రైతులు ఆగమైతున్నరు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని ఆవేదన చెందుతున్నారు. వానల కారణంగా కోసిన పంటను అమ్ముకోలేక, చేన్లలో ఉన్న పంటలను కొయ్యలేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వానలకు వరి పొలాల్లో వడ్లన్నీ రాలిపోయాయి. కొంతమంది రైతులు ఇప్పటికే పొలాలు కోసి, వడ్లను కొనుగోలు కేంద్రాలు తీసుకురాగా అవి తడిసిపోయాయి. ఇటీవల రోజూ వర్షం పడుతుండడంతో సెంటర్లలోని వడ్లను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లలో కనీస సౌలతులు లేకపోవడంతో వడ్లు తడిసిపోతున్నాయని, వెంటవెంటనే కొనుగోళ్లు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈదురుగాలులకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చెట్ల కాయలన్నీ రాలిపోయాయి.
చేతికొచ్చిన పంట నీళ్లపాలు..
యాసంగి పంటలన్నీ కోత దశలో ఉన్నాయి. ఈ టైమ్ లో వర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి, మక్క, మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కోతలు మొదలు కాగా, ఆలస్యంగా వేసిన మరికొన్ని జిల్లాల్లో వరి, మక్క చేన్లు నేలవాలాయి. జనగామ, నిజామాబాద్, పెద్దపల్లి, మెదక్ సంగారెడ్డి, కరీంనగర్ తదితర జిల్లాల్లో వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక వడ్లు సెంటర్లలో పోసిన రైతులు రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు. వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవడానికి కాపలా కాస్తున్నారు. కొన్ని రోజులుగా ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు పడుతుండడం.. కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వడ్ల కుప్పలు, బస్తాలు తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి డ్రయర్లు లేక తిప్పలు పడుతున్నారు.
వేలాది ఎకరాల్లో నష్టం..
మా జిల్లాలో వడగండ్ల వానకు వేలాది ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. రైతులంతా ఆందోళనలో ఉన్నరు. ఈదురు గాలులు, వర్షాలకు మామిడి కాయలు కూడా రాలిపోయాయి.
- రామ్మోహన్‌రెడ్డి, వెల్దండ, జనగామ జిల్లా
నెల సంది గోస..
పొలాలు కోసి నెల దాటింది. అప్పటి నుంచి గోస పడుతున్నం. రోజూ వానలకు కావలి కాయలేక ఇబ్బంది పడుతున్నం. వడ్లు కాంటా పెట్టిన్రు. లారీలు రావట్లేదు..బస్తాలు తీస్కపోతలేరు.
- సత్తయ్య, పెద్దపల్లి జిల్లా