
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లిలో మంగళవారం ఉదయం అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లిన ఓ బాలుడు వ్యాన్ కిందపడి చనిపోయాడు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండబోయిన శరత్, -మమత దంపతులకు ఇద్దరు కొడుకులు.
పెద్ద కొడుకు శాన్విక్, చిన్న కొడుకు శివాన్ష్(3). మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామంలోని సర్కారు బడిలో శాన్విక్ యూకేజీ చదువుతున్నాడు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వచ్చేవాడు. ఎప్పటిలాగే అతన్ని బస్సు ఎక్కించేందుకు చిన్న కొడుకు శివాన్ష్ ను వెంటబెట్టుకుని తల్లి మమత వెళ్లింది. ఈ క్రమంలో శివాన్ష్ ఒక్క సారిగా బస్సు వద్దకు వెళ్లగా, డ్రైవర్ గమనించకుండా బస్సును కదిలించాడు. శివాన్ష్ తలపైనుంచి టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్ దాసరి రాజేశ్అజాగ్రత్తగా బస్సు నడపడంతోనే శివాన్ష్ మృతిచెందాడని కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ తెలిపారు. రాజేశ్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.