Team India: రోహిత్, కోహ్లీలకు గుడ్ బై!.. ట్రెండింగ్‌లో హ్యాపీ రిటైర్మెంట్

Team India: రోహిత్, కోహ్లీలకు గుడ్ బై!.. ట్రెండింగ్‌లో హ్యాపీ రిటైర్మెంట్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు వీరిద్దరిని భారత జట్టు పిల్లర్లాంటి వారని చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు వీరే జట్టుకు భారంగా తయారయ్యారు. సిరీస్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా భాధ్యతారాహిత్యంగా ఆటాడుతున్నారు. ఓ వైపు అదే పిచ్‌లపై జూనియర్లు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నా.. వీరు మాత్రం క్రీజులో పట్టుమని పది నిమిషాలు కూడా నిలదొక్కుకోలేకపోతున్నారు. 

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వీరి ఆటలో ఎలాంటి మార్పు లేదు. ఆఖరి రోజైనా క్రీజులో నిలదొక్కుకొని జట్టును ఓటమి నుంచి బయట పడేస్తారనుకుంటే.. అదీ లేదు. తమకేం సంబంధం లేదన్నట్లు త్వరగా ఔటై డకౌట్‌లో సేద తీరారు. ఓవైపు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్(84) ఆపద్భాందవుడిలా జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. మరో ఎండ్‌లో అతనికి కనీస సహకారం అందించలేకపోయారు. పది, పదకొండో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న బౌలర్ల కన్నా.. తక్కువ బంతులు ఎదుర్కొంటున్నారు. దాంతో, వీరిద్దరే వార్తల్లో నిలుస్తున్నారు.

మూడు టెస్టుల్లో 31 పరుగులు

బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు సాధించాడు. ఈ సిరీస్ అంతటా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 6.27 సగటుతో 31 పరుగులు చేశాడు. ఇందులో 10 పరుగులు అతడి హయ్యెస్ట్ స్కోర్. మరోవైపు, పరుగుల యంత్రంలా పేరు తెచ్చుకున్న కోహ్లీది అదే ఆట. ఆసీస్ పర్యటనలో ఒక సెంచరీ తప్ప విరాట్ రాణించిందేమీ లేదు. పైగా ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి మరిన్ని పరుగులు చేసేలా వారిలో కసి పెంచుతున్నాడు. దాంతో జట్టుకు వీరి సేవలు అవసరమా..? అంటూ సోషల్‌ మీడియాలో భారత అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ALSO READ : AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓటమి

 ట్రెండింగ్‌లో #HappyRetirement

వరుసగా విఫలమవుతున్న రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. వీరి గణాంకాలను పోస్ట్ చేస్తూ రంజీల్లో ఆడి సత్తా నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "హ్యాపీ రిటైర్మెంట్” # HappyRetirement అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.