నారాయణపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కోసం చక్కటి కామన్ మెనూ అమలులోకి తెచ్చిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తెలిపారు. సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులు బాలికల వసతి గృహాల్లో బస చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు సోమవారం సాయంత్రం నారాయణపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. భోజనం బాగుంటుందా ? అందరికీ పుస్తకాలు అందాయా? అని అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో నర్సు ఉందా? ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారని అడిగారు.
అందరూ బాగా తినాలని, పాలు, రాగి జావా తీసుకోవాలని సూచించారు. టెన్త్ విద్యార్థులు తమకు గ్రౌండ్ కావాలని కోరగా, అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం గురుకుల విద్యార్థినులు పిరమిడ్ ఆకృతుల ప్రదర్శనను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి తిలకించారు. వండిన భోజనాన్ని, కూరగాయలను పరిశీలించి, మోను ప్రకారమే వంట చేశారా? అని ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. మెనూ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు.
విద్యార్థినులతో కలిసి కలెక్టర్, ప్రత్యేక కార్యదర్శి క్యూలో నిలబడి భోజనం వడ్డించుకుని, వారితోనే కలిసి భోజనం చేశారు. అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలోనే ఉన్న కేజీబీవీని సందర్శించి స్టూడెంట్స్తో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్, డీఈవో గోవిందరాజులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్, డీఈవో గోవిందరాజులు, ఆర్అండ్ బీ డీఈ రాములు, గురుకుల ప్రిన్సిపాల్ తో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె గురుకులంలో బస చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల ఉన్నారు.