విలాసాలకో, మ్యాచ్ కోసమో దుబాయ్​ పోలే : హరీశ్​ ​

విలాసాలకో, మ్యాచ్ కోసమో దుబాయ్​ పోలే : హరీశ్​ ​
  • దుబ్బాక ఎమ్మెల్యే కూతురి పెండ్లికి పోతే వివాదం చేస్తారా?: హరీశ్​ ​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. క్రికెట్  మ్యాచులు చూడడానికో, విలాసాల కోసమో తాను దుబాయ్  పోలేదని పేర్కొన్నారు. తన మిత్రుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి  కూతురి పెండ్లి కోసం అబుదాబికి వెళ్లానని, దాన్ని కూడా వివాదం చేయడం సీఎం నీచత్వానికి పరాకాష్ట అని ఆదివారం ఒక ప్రకటనలో  హరీశ్  మండిపడ్డారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరిగితే.. ఘటనా స్థలానికి వెళ్లకుండా, బాధ్యత మరిచి ఎలక్షన్  ప్రచారానికి వెళ్లారని సీఎంను ఆయన విమర్శించారు. 

తాను దుబాయ్​  వెళ్లింది గత నెల 21న అని, ఎల్ఎల్‌బీసీ  ప్రమాదం  22న జరిగిందని తెలిపారు. హెలికాప్టర్  తీసుకొని ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరని ప్రశ్నించారు. హెలికాప్టర్  లేదని నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఘటనా స్థలానికి వెళ్లకుండా హైదరాబాద్ లో ఉన్నారని విమర్శించారు. కార్మికులను కాపాడకపోగా, కనీసం వారి మృతదేహాలను కూడా బయటకు తీయలేకపోయారని వ్యాఖ్యానించారు.   

సన్​ఫ్లవర్ కొనుగోలు సెంటర్లు ఏవీ? 

సన్​ఫ్లవర్ పంట కోతకు వచ్చినా.. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని  హరీశ్ మండిపడ్డారు. ఫలితంగా మద్దతు ధర కన్నా తక్కువ రేటుకు పంటను దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.