ఆత్మీయ భరోసా రైతు కూలీలందరికీ ఇవ్వాలి : హరీశ్​ రావు

  • కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేలు  ఇవ్వాలి
  • గ్రామసభల్లో  లబ్ధిదారులను ఎంపిక చేయాలి
  • మాజీ మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు:  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎలాంటి కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వర్చువల్ గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని, వీరీలో  కూలి పనికి వెళ్లే  ఎస్సీ ఎస్టీ, బీసీ నిరుపేద రైతులేఎక్కువగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారని తెలిపారు.

గుంట భూమి ఉన్నా  రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు.    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలు ప్రకటించాలని, నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్పింది  కానీ లబ్ధిదారుల ఎంపిక  విధివిధానాలు విడుదల చేయలేదని అన్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అందరూ పేదవారే కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.