
- హరీశ్ రావు విమర్శ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో సాధించిన వృద్ధిని.. కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే దెబ్బతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కరోనా టైంలో తప్ప పదేండ్లలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సగటున 25.62 శాతం వృద్ధిని నమోదు చేసిందని, రేవంత్ అధికారంలోకి వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.93 శాతం తగ్గిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ఇండ్లు కూల్చడం, మూసీ రివర్‌ఫ్రంట్ పేరుతో బుల్డోజర్లు పంపడం, మెట్రో ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి ప్రగతిని అడ్డుకోవడం, ఫార్మాసిటీని రద్దు చేయడం వంటి కారణాలతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆరోపించారు. ఆ తొందరపాటు నిర్ణయాలతోనే తెలంగాణ వెనకబడుతోందని అన్నారు.