
కేసీఆర్ తెలంగాణ తెచ్చాకే రేవంత్ సీఎం అయ్యారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ కు సీఎం కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. ఓటమి తర్వాత వచ్చేది గెలుపేనని..ఇది జస్ట్ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అక్కడిప్రజలు ఆలోచన చేస్తున్నారు..నీళ్లేవో...పాలేవో తెలిసిపోయిందన్నారు. మరో ఆరునెలలు ఆగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెతుక్కుని మరీ బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారని చెప్పారు.
మార్చి 17 లోపు రుణమాఫీ, మహిళలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. 100 రోజుల్లో ఇచ్చినహామీలు అమలు చేయకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. పాలన చేతకాక రేవంత్ ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ 14 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇస్తలేదన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ వచ్చాక మోటార్లు ,ట్రాన్స్ ఫార్మార్లు కాలుతున్నాయని విమర్శించారు. రేవంత్ మాటలు.. సీఎం కుర్చీ హుందాతనాన్ని పోగోడుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ దళిత బంధుఇస్తే కాంగ్రెస్ ఉన్నవి బంద్ పెట్టారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ జూటా మాటలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కొడితే అందుబాటులో ఉంటానని చెప్పారు. మెదక్ లో గులాబీ జెండా ఎగురువేస్తామని చెప్పారు.