అడవి తగ్గుతున్నది.. ఉమ్మడి జిల్లాలో ఘననీయంగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం

  • గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన హరితహారం అట్టర్ ప్లాప్
  • 20 కోట్ల మొక్కల లెక్కలపై గందరగోళం
  • ఐఎస్ఎఫ్ రిపోర్టుతో వాస్తవాలు వెలుగులోకి..

నిర్మల్, వెలుగు: అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్​లో అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పథకం కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలపైనా గందరగోళం నెలకొంది. హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణం పెరగాల్సింది పోయి దానికి విరుద్ధంగా అడవులు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దట్టమైన కీ కారణ్యం, వాగులు, వంకలు, సెలయేర్లతో ఆకుపచ్చని ప్రపంచాన్ని ఆవిష్కరింపజేసే ఆదిలాబాద్ జిల్లాలో పోడు సాగుతో పాటు అక్రమంగా చెట్ల నరికివేత, స్మగ్లింగ్ అలాగే వరదల కారణంగా అడవులు అంతరించిపోతున్నాయి.

ఐదారేండ్లుగా క్రమంగా తగ్గుముఖం

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్) ప్రకారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుముఖం పట్టినట్లు తేలింది. ఒక్క మంచిర్యాల జిల్లా మినహా ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లాలలో అటవీ విస్తీర్ణం ఐదారేండ్లుగా తగ్గుముఖం పడుతున్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో ఫీల్డ్ బేస్డ్ సర్వే ఆధారంగా రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ డాటాతో ఈ అడవుల విస్తీర్ణాన్ని నిర్ధారించారు.

 ఈ లెక్కల ప్రకారం నిర్మల్ జిల్లాలో 45.37 చదరపు కిలోమీటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.61 చ.కి.మీ, ఆదిలాబాద్ జిల్లాలో 115.50 చ.కి.మీ. విస్తీర్ణం తగ్గిపో యినట్లు ఆ రిపోర్టులో స్పష్టమవుతోంది. అయితే మంచిర్యాల జిల్లాలో మాత్రం సింగరేణి సంస్థ చేపట్టిన మొక్కల పెంపకం కారణంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్లు ఆ రిపోర్డులో అధికారులు వెల్లడించారు. జిల్లాలో 34.96 చ.కి.మీ. మేర అడవి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో 1778.26 చ.కి.మీ., మంచిర్యాలలో 1564.93 చ.కి.మీ., ఆదిలాబాద్​లో 1145.76 చ.కి.మీ., నిర్మల్ జిల్లాలో 1085.02 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 ఆగని చెట్ల నరికివేత

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడవుల నరికివేత వ్యవహారం ఇంకా సద్దుమనగడం లేదు. కలప అవసరాల కోసం కొంత మంది స్మగ్లర్లు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తున్నారు. చెట్లు నరికివేసి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో కలప భద్రపరిచిన ఇండ్లపై అటవీశాఖ అధికారులు తనిఖీలు చేయగా స్మగ్లర్లు తిరగబడి దాడి చేసిన సంగతి తెలిసిందే. అటవీ అధికారులు దాడులు చేస్తూ స్మగ్లింగ్​ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో మాత్రం చెట్ల నరికివేత ఆగడం లేదు. 

పోడు వ్యవసాయం, కలప కోసం చెట్లను నరికివేస్తూనే ఉన్నారు. చెట్ల నరికివేతను నిరోధించి స్మగ్లింగ్​ను అరికట్టేందుకు అటవీశాఖ ఇన్​ఫార్మర్ల నెట్​వర్క్​ ఏర్పాటు చేసుకున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. నిర్మల్ జిల్లా లోని కడెం, పెంబి, ఖానాపూర్, దస్తురాబాద్ అడవుల్లో కొంతకాలం వరకు పెద్ద ఎత్తున చెట్ల నరికివేత సాగింది. కొన్ని మారుమూల పల్లెల పరిధిలోని అడవుల్లోనే విస్తీర్ణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కూడా చెట్లు నేలకొరిగిపోతున్నాయని వాదనలు ఉన్నాయి.  

 హరితహారం లెక్కలపై గందరగోళం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఆశించిన ఫలితం ఇవ్వలేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 కోట్ల మొక్కలు నాటినట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ మొక్కల లెక్కలపై అయోమయం నెలకొంది. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు నాటితే అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరగాలి కానీ తగ్గిపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.