- ప్రధాని మోదీ కామెంట్
నాగ్‌పూర్: ప్రజల్లో కాంగ్రెస్ విషబీజాలు నాటుతున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. హర్యానాలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని తెలిపారు. దళితులను విభజించేందుకు అసత్య ప్రచారాలు చేసిందని ఆరోపించారు. అయినా.. హర్యానా ప్రజలు కాంగ్రెస్ కుట్రలను ఛేదించారన్నారు. బుధవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మోదీ రూ.7,600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజించాలని చూస్తున్నదని, ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నదని మండిపడ్డారు.
హర్యానాలో చరిత్రాత్మక విజయం
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని తలచుకుంటూ ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విద్వేషపూరిత కుట్రలు, వారి అర్బన్ నక్సల్కూటమి చేతిలో చిక్కబోమని హర్యానా ప్రజలు తమ ఓట్లతో తేల్చిచెప్పారని అన్నారు. ‘‘నిన్న హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో మూడోసారి బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించాలని చూసింది. దళితుల మధ్య అసత్యాలను ప్రచారం చేసింది.
కాంగ్రెస్ తమనుంచి రిజర్వేషన్లు లాక్కొని, వారి ఓటబ్యాంకు (ముస్లింలు)కు ఇస్తుందని హర్యానా ప్రజలు గుర్తించారు” అని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని రైతులను కూడా కాంగ్రెస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని అన్నారు. కానీ.. పంటలకు కనీస మద్దుతు ధర ఎవరు ఇచ్చారో హర్యానా రైతులకు తెలుసు కాబట్టే.. వారు అక్కడ బీజేపీని గెలిపించారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు కూడా అదే స్ఫూర్తిని చాటాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమికే పట్టంకట్టాలని పిలుపునిచ్చారు.
మోదీని కలిసిన నాయబ్ సింగ్ సైనీ
హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నాయబ్ సింగ్ సైనీ మోదీని కలిశారు. ఈసారి కూడా సైనీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మోదీతో భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోనూ సమావేశమయ్యారు.