హసరంగా గాయం నుంచి కోలుకొని మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. చెలరేగి వికెట్లు తీస్తున్నాడు. జింబాబ్వే తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2023 ఐపీఎల్ సీజన్‌లో హసరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అందుకు గానూ రూ.10.75 కోట్లను తీసుకున్నాడు. కానీ ఈసారి అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో రూ.1. 50 కోట్ల కనీస ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. దీంతో కావ్య మారన్ మొహంలో సంతోషం కనిపించింది.
కావ్య మారన్ వేలంలో తక్కువకే దక్కించుకొని మంచి పని చేసిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 26 ఏళ్ళ హసరంగా జింబాబ్వే బ్యాటర్ల భరతం పట్టారు. జాయ్‌లార్డ్ గుంబీ (29), క్రెయిగ్ ఎర్విన్ (0), మిల్టన్ షుంబా (2), క్లైవ్ మదండే (0), కైటినో (17) వెల్లింగ్టన్ మసకద్జా,బ్లెస్సింగ్ ముజారబానీ (0) లు హసరంగా స్పిన్ ధాటికి బలయ్యారు. మెన్స్ వన్డే క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్‌గా హసరంగ నిలిచాడు.
హసరంగా బౌలింగ్ ధాటికి శ్రీలంక ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 96 పరుగులకు జింబాబ్వే ఆలౌటైంది. 97 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. కెప్టెన్ కుశాల్ మెండిస్ 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు,మూడు వన్డేలు లంక గెలిచి వన్డే సిరీస్ ను 2-0 తేడాతో గెలిచింది.