ఆదిలాబాద్‌కు ఆధ్యాత్మిక శోభ
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్పట్టణంలోని డైట్గ్రౌండ్లో నిర్వహించనున్న శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతిరుద్ర మహాయాగంతో పట్టణం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ నెల 22 నుంచి జనవరి 6 వరకు నిర్వహిస్తున్న సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, 85వ విశ్వశాంతి మహాయాగం నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తు న్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ రంగురంగుల విద్యుత్‌దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.
అపరిశుభ్రతపై డీఎంహెచ్ వో సీరియస్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషీర్ నగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, పరిసరాల్లో చెత్త పేరుకుపోయి ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో అపరిశుభ్రత ఏంటని అసహనం వ్యక్తం చేశారు. వైద్య అధికారి, సిబ్బంది తీరు మార్చుకోవాలని.. ఎప్పటికప్పుడు పరిసరాలు, గదులను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ సుచరిత, వైద్యాధికారి, వైద్య సిబ్బంది ఉన్నారు.
మత్తు పదార్థాలను అంతం చేయాలి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలో గంజాయి, నార్కోటిక్ తదితర మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్కలెక్టర్రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో నార్కోటిక్–కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ప్రజలు గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో సారథి కళాకారులతో గంజాయి, పొగాకు, తదితర వాటి పై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయించాలన్నారు. గంజాయి రవాణా, క్రయ విక్రయాలను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. అడిషనల్కలెక్టర్ శ్యామలా దేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి
మంచిర్యాల, వెలుగు: ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్స్ రాంమోహన్ బండా, ఓం ప్రకాశ్ నిర్వహించిన మెడిటేషన్లో పాల్గొన్నారు. ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన ధ్యానం, యోగా ఆధునిక కాలంలో విశ్వవ్యాప్తం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతుంటారని.. ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.
అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
జైపూర్(భీమారం), వెలుగు: అడవుల నుంచి భీమారం మండల కేంద్రంలోకి వచ్చిన కోతుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని.. ఇందుకు కారణమైన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని శనివారం గ్రామస్తులు ఎస్సై శ్వేతకు ఫిర్యాదు చేశారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కోతులు గ్రామంలో చేరి పంటలను నాశనం చేస్తున్నాయని, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. ఈ విషయంపై పలుమార్లు అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా చూడాలని ఎస్సైని కోరారు.
నిబంధనలు పాటించని వైన్స్‌లకు ఫైన్
కోల్‌బెల్ట్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా మందమర్రి పట్టణంలోని పలు వైన్స్ షాపుల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయించడంపై మున్సిపల్ ఆఫీసర్లు ఫైన్ విధించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఆఫీసర్లు వైన్స్ షాపుపై దాడులు చేశారు. పావణి, రాజరాజేశ్వరి వైన్ షాపుల్లో ప్లాస్టిక్ వస్తువులు, మరోషాప్లో నాణ్యతలేని ఫుడ్‌ను అమ్ముతుండడంతో రూ.3,500 ఫైన్విధించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుం దర్ తదితరులు పాల్గొన్నారు.