25న సీఎం పర్యటన సక్సెస్ చేయాలి
నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: ఈ నెల 25న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రాజిరెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. మెదక్ చర్చి వందేళ్ళ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సుప్రభాత రావు, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
దళిత సంఘాల నిరసన
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట బీసీ దళిత బహుజన సంఘాలతో ఏర్పడిన రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రపంచమే గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ పట్ల హేళన చేస్తూ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల నాయకులు రామారావు , మందుల వరలక్ష్మి , అశోక్ , దుర్గాప్రసాద్ , మాణిక్యం ,జైపాల్ ,అన్వర్ ,మహబూబ్ అలీ ,అంజయ్య ,శ్రీకాంత్ ,పల్లె సంజీవయ్య పాల్గొన్నారు.
కరెంట్ స్తంభానికి ఉరేసుకుని వ్యక్తి సూసైడ్
చిన్నశంకరంపేట, వెలుగు: మద్యానికి బానిసై ఓ వ్యక్తి కరెంట్ స్తంభానికి ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల సిద్ధిరాములు (45) వృత్తి రీత్యా పెయింటర్. కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. ఉదయం ఇంటి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు.
ఉరి వేసుకొని యువకుడు మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన మంతూరి నితీశ్ (25 ) తండ్రి చనిపోవడంతో తల్లి, చెల్లెలితో కలిసి బతుకుదెరువు కోసం టైల్స్ పని చేసుకుంటూ పొన్నాల టీహెచ్‌ఆర్ నగర్‌లో నివాసముంటున్నాడు. అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, కులాలు వేరు కావడంతో ఒప్పుకోలేదు.
దీంతో జులై నెలలో గొడవ జరిగింది. దీంతో అమ్మాయితో మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె పురుగుల మందు తాగి చనిపోయింది. నితీశ్ కారణంగానే తమ కూతురు చనిపోయిందని యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు చేయగా.. నితీష్ జైలుకు వెళ్లొచ్చాడు. కాగా తన ప్రేమ వల్లే అమ్మాయి చనిపోయిందని బాధపడుతూ శనివారం రాత్రి తల్లి, చెల్లెలు గోడపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లడంతో రాత్రి ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. తల్లి మంతూరి పద్మ ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: సంగారెడ్డి టౌన్ పోతిరెడ్డిపల్లి లోని రైతు వేదికలో సోమవారం మంజీరా రైతు సమైక్య జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ స్కోర్ చైర్మన్ సంగమేశ్వర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. రామ్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ చైర్మన్ కుమార్ ,వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్, రైతు సంఘం నాయకులు రవీందర్, జైపాల్ , సంగ్ శెట్టి ,వెంకట్రావు ,మల్లికార్జున శెట్టి , మానేయ ,ధనుంజయ్, రాజు ,శివయ్య, మల్లన్న పాల్గొన్నారు.