సీఎంకు శుభాకాంక్షలు
సూర్యాపేట, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని గురువారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో త్వరలో జరిగే పెద్దగట్టు జాతరకు రావాలని కోరారు. జాతర డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసినవారిలో పటేల్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
హాలియా, వెలుగు : అనుముల మండలం మధారిగూడెం గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకుడు రిక్కల వాసుదేవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి గురువారం మధారిగూడెం గ్రామానికి వెళ్లి మృతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, పేరూరు దేవస్థానం చైర్మన్ రిక్కల కొండారెడ్డి, నాయకులు ఉన్నారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మిర్యాలగూడ, వెలుగు : నూతనకల్లు మండల కేంద్రానికి చెందిన దళిత వ్యక్తి కాటూరి రామును విచక్షణారహితంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాముపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్పీ తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన పోలీస్ ఆఫీసర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమీషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఏబీ బర్ధన్ వర్ధంతి
హుజూర్ నగర్, వెలుగు : దేశంలో సంకీర్ణ రాజకీయాలను సమర్థవంతంగా నడిపిన నాయకుడు ఏబీ బర్ధన్ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ లో మాజీ సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబీ బర్ధన్ 9వ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత రాజకీయాల్లో కురువృద్ధుడుగా పేరు పొందిన నాయకుడు బర్ధన్ అన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు. .
రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలి
హాలియా, వెలుగు: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్, పీసీసీ డెలిగేట్ కర్నాటి లింగారెడ్డి సూచించారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం హాలియాలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో తులసి హాస్పటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి రూ.85 లక్షలు మంజూరు
నేరేడుచర్ల (పాలకవీడు), వెలుగు : పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి రూ.85 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈనెల 24లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం మండల కాంగ్రెస్ నాయకులు జనపహాడ్ దర్గాలో పూజలు చేసి పనులు ప్రారంభించారు.
చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలి
నార్కట్పల్లి, వెలుగు : చిన్న నిర్మాతలను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’ సినిమా నిర్మాత రేగటి లింగారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ బండారు దానయ్య తెలిపారు. గురువారం నార్కట్ పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రామలింగేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’ సినిమాను రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నారన్నారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. ఈ సినిమాలో హీరో ఆదిత్య ఓం, హీరోయిన్ రోహిణి, విలన్ గా చలపతి రాజుతోపాటు పోసాని కృష్ణ మురళి, సుమన్, రాహుల్ ఉన్నారని వివరించారు. నల్లగొండ జిల్లా నిర్మాతలమైన మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.