
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో గురువారం కురిసిన వాన భారీ నష్టం కలిగించింది. ఆలేరు, గుండాల మండలాల్లో జల్లులు కురవగా.. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఈదురుగాలులు వీచినా వాన పడలేదు. తుర్కపల్లి మండలంలో ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వాన వల్ల చేన్లలో వరిపంట దెబ్బతిని వడ్లు రాలిపోయాయి. వరి పంట దెబ్బతింది. వడగండ్ల కారణంగా తుర్కపల్లి , వాసాలమర్రి, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లిల్లో మామిడితోటల్లో చెట్లకు ఉన్న కాయలు రాలిపోయి.. రైతులకు నష్టం వాటిల్లింది.
నర్సరీల్లోని మొక్కలు వాన నీటిలో మునిగి దెబ్బతిన్నాయి. స్తంభాలు కూలిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడడం వల్ల జగదేవ్పూర్ రోడ్డులో భువనగిరి-తుర్కపల్లి మధ్య కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రాజాపేట మండలం బేగంపేటలో పిడుగుపడడంతో గడ్డమీద ఉప్పలయ్యకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. వడగండ్ల వాన కారణంగా తుర్కపల్లిలో ఎంతమేర వరి పంట నష్టం జరిగిందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆరా తీస్తోంది. నారాయణపూర్లో 97.8 మిల్లీ మీటర్ల వాన కురియగా, తుర్కపల్లిలో 82.5 మిల్లీ మీటర్ల వాన కురిసింది.