అయిజ/శాంతినగర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పంటలు నీట మునిగాయి. ఆయా మండలాల పరిధిలో లో లెవల్బ్రిడ్జిల పై నుంచి వరదనీరు ప్రవహించడంతో ఆయా మండలాల ఎస్సైలు బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను కాపలా ఉంచారు. దీంతో ఎక్కడి వారు అక్కడే వెనుతిరిగి వెళ్లిపోయారు. కర్నూల్ రాయచూర్ అంతర్ రాష్ట్ర హైవేలో జూలకల్ దగ్గరలో వాగు పోంగడంతో రాకపోకలకు బంద్అయ్యాయి. అయిజ పట్టణంలో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో మధ్యాహ్నం వరకు పట్టణవాసులు ఎవరూ బయట తిరగలేదు. జిల్లా వ్యాప్తంగా 344.6 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా సంకాపురం గ్రామంలో నరసింహాచారి అనే వ్యక్తి ఇంటి గోడ కూలింది.
వాగులో గల్లంతైన ప్రైవేటు లెక్చరర్ మృతి
మదనాపురం, వెలుగు: మదనాపురం రైల్వే గేట్ సమీపంలోని ఊక చెట్టు వాగులో రెండు రోజుల కింద గల్లంతైన ఆకుల కురుమూర్తి మృతి చెందాడు. గురువారం ఉదయం పోలీసులు, రెవెన్యూ అధికారులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టగా.. గోపన్ పేట శివారులో కురుమూర్తి డెడ్‌బాడీ నీటిపై తేలి మత్స్యకారులకు కనిపించింది. అధికారులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. లెక్చరర్కురుమూర్తికి భార్య లావణ్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొత్తకోట నివేదిత జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కురుమూర్తి మృతితో రోడ్డున పడ్డ ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలు పార్టీల లీడర్లు కోరారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఆఫీసర్లు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగం అధికారులు ఇంటి, నల్లా బిల్లులకు సంబంధించి రూ.25 లక్షలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మున్సిపల్ అద్దె షాపుల నిర్వహణలోనూ అవినీతి జరిగిందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించే నిధులను సంబంధిత ఆఫీసర్లు ఇష్టానుసారంగా మంత్రి ప్రచారాలకు వాడడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణవర్ధన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎ.అంజయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు మళ్లీ వరద
గద్వాల/అచ్చంపేట, వెలుగు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 41 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 9.152 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.445 టీఎంసీల నీటిని నిలువ ఉంచుకొని 41 గేట్లను ఓపెన్ చేసి 2,55,842 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల డ్యాంకు 2,40,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నది.
శ్రీశైలం గేట్లెత్తిన అధికారులు
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 4,38,983 క్యూసెక్కులు కాగా, 4,35,157 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగుల నీటి మట్టం ఉందన్నారు.
తెలంగాణ గ్రామాల పనితీరు భేష్
ఆమనగల్లు, వెలుగు : తెలంగాణలో గ్రామపంచాయతీల పనితీరు బాగుందని అసోం రాష్ర్టానికి చెందిన ప్రజాప్రతినిధులు అన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా చూసేందుకు కడ్తాల్ గ్రామ పంచాయతీని అసోం కు చెందిన ప్రజాప్రతినిధుల బృందం జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ కో డైరెక్టర్ ఎంవీ రవిబాబు ఆధ్వర్యంలో విజిట్చేసింది. ఈ సందర్భంగా వారు గ్రామంలోని శ్మశాన వాటిక, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, తాగు నీటి వనరులు, రోడ్లను, ఎల్ఈడీ వ్యవస్థ, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల అభివృద్ధి భాగస్వామ్యం గురించి, మహిళా సంఘాల పనితీరు గురించి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేశ్వర్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ప్రజాప్రతినిధులు ప్రసాద్, చిత్రలేఖ, దురత్, సోన, ఉప సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు.
భార్యను చంపిన కేసులో వ్యక్తికి జీవితఖైదు
గద్వాల, వెలుగు: భార్యను చంపిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కనకదుర్గ గురువారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ రంజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గట్టు మండలం మాచర్లకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్ కి, రాజోలి విలేజ్ కి చెందిన పద్మావతి అలియాస్ అంపమ్మ కు 15 ఏండ్ల కింద పెళ్లైంది. భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. భార్యను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుని గతేడాది ఇంట్లో నిద్రిస్తున్న భార్యను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యం ప్రవేశపెట్టి నిందితుడికి శిక్షపడేలా చేశారన్నారు. మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, హత్యా నేరానికి జీవిత ఖైదు తో పాటు 2 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు.
‘బీజేపీ భరోసా’ తో ప్రజలకు దగ్గరవ్వాలి
నారాయణపేట, వెలుగు: ‘బీజేపీ భరోసా’ కార్యక్రమంతో కార్యకర్తలు ప్రజల్లోకి దగ్గరవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడులు నాగురావు నామాజీ, కె.రతంగ్ పాండురెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు అధ్యక్షతన నారాయణపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. హాజరైన వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గం లో బైక్ ర్యాలీ నిర్వహించాలని కోరారు. ఈనెల 13 నుంచి 23 వరకు బైక్ ర్యాలీ ఉంటుందని, మొదటి రెండు రోజులు నారాయణపేట ఎక్లాస్పూర్ నుంచి ప్రారంభమౌతుందని, 15, 16 తేదీల్లో ధన్వాడ, 18న మరికల్, 19న నారాయణపేట పట్టణంలో 20, 21 న దామర్గిద్ద మండలంలో, 22, 23 తేదీల్లో కోయిల్‌కొండ మండలాల్లో బైక్ ర్యాలీలు ఉంటాయన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌వర్ధన్, మల్లయ్య, సిద్ధి వెంకట్రాములు, మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
సమైక్య వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి
గద్వాల, వెలుగు: ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే జాతీయ సమైక్య వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్ కుమార్ కోరారు. వజ్రోత్సవ ఏర్పాట్లను గురువారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్, ఇండోర్ స్టేడియం, తేరు మైదానం, అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా, మార్కెట్ యార్డులో ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 16న ప్రతి నియోజకవర్గంలో 15 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. 17న జిల్లా కేంద్రంలో చీఫ్ గెస్ట్ లచే జాతీయ జెండా ఆవిష్కరణ, 18న కవులు, కళాకారులు, ఫ్రీడమ్ ఫైటర్లకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీరి వెంట ఏఎస్పీ రాములు నాయక్, ఆర్డీవో రాములు తదితరులు ఉన్నారు.
హాస్టళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి
హాస్టల్స్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. గురువారం ఇటిక్యాల ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ లను కలెక్టర్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం ఫుడ్ క్వాలిటీ గా అందుతుందా లేదా అనే వివరాలను స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని హాస్టల్ లో నీట్ గా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్లోని లెట్రిన్, టాయిలెట్స్ లను పరిశీలించారు.
వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మక్తల్, వెలుగు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అడిషనల్కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్ హాల్లో అధికారులతో నిర్వహించిన మీటింగ్‌కు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75 ఏండ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమమన్నారు.
జీవ వైవిధ్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
వనపర్తి, వెలుగు: జీవ వైవిధ్య చట్టాన్ని యాజమాన్య కమిటీలు పక్కాగా అమలు చేయాలని జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్‌లో జీవవైవిధ్య చట్టం పై జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన లోక్‌నాథ్‌రెడ్డి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ మనుగడలో వృక్షాలు, జంతువుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త శిల్పి శర్మ మాట్లాడుతూ జీవవైవిద్య చట్టం ముఖ్య ఉద్దేశం జీవ వనరులను సంరక్షించడమేన్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. అడిషనల్ కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీఆర్డీవో పీడీ నర్సింహులు పాల్గొన్నారు.
వరిలో తెగుళ్ల నివారణపై అవగాహన
పెబ్బేరు, వెలుగు : వరి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి అవగాహన కల్పించారు. గురువారం పెబ్బేరు మండలంలోని సుగూరు గ్రామంలో పర్యటించారు. వానకాలం సాగు నమోదులో భాగంగా గ్రామంలో వరిపొలాలను పరిశీలించారు. అనంతరం మండలానికి సంబంధించి ఆన్లైన్లో ఏఈవో నమోదు చేసిన వివరాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఏఈవో బిందు, రైతులు పాల్గొన్నారు.