హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. మే 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్ తోపాటు నగర శివారులోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈక్రమంలో గోడ కూలి ఓ చిన్నారి, చెట్టు కూలి మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. సిటీలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అక్కడకక్కడా కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.వర్షం ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది.. ఎప్పటికప్పుడు కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు.
హయత్ నగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బోడుప్పల్ లో వర్షానికి కాలనీల్లోకి నీళ్లు చేరాయి. పెద్ద అంబర్ పేట, ఫిర్జాదిగూడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, గుర్రంగూడ, తుర్కయంజాల్ లో భారీ వర్షం కురిసింది. అటు కాచిగూడ, నల్లకుంటలో వర్షం ధాటికి అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎల్బీనగర్ లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జాం అయింది.
వనస్థలిపురంలోని పలు కాలనీల్లో భారీ ఈదురుగాలులకువాన పడింది. గణేష్ టెంపుల్ వెనకాల భారీ చెట్టు కూలింది. పక్కనే గోడ కూలడంతో పార్కింగ్ లో ఉన్న కారు ధ్వంసమైంది. వనస్థలిపురం ఏరియా ప్రభుత్వాస్పత్రి దగ్గర మరోచెట్టు కూలింది. అటు సాయినగర్ హుడా కాలనీలోనూ చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడ్డాయి. సుష్మా చౌరస్తా దగ్గర మన్సూరాబాద్ వెళ్లే మార్గంలో 11KV విద్యుత్ వైరు తెగిపడింది. ఘటనలో ఓ యువతికి తృటిలో ప్రమాదం తప్పింది.
మేడ్చల్, కీసర, ఘట్ కేసర్ లోనూ ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. ఘట్కేసర్ మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు ఘట్కేసర్ నుంచి ECILకు వెళ్లే దారిలో చెట్లు పడిపోయాయి. ఘటనలో ఒకరు స్పాట్ లో చనిపోయారు. అటు పర్వతపూర్ లో తాటిచెట్టుపై పిడుగుపడింది.