- రోడ్లన్నీ జలమయం...ఆగిన రాకపోకలు
- ఇండ్లలోకి చేరిన నీళ్లు..జన జీవనం అస్తవ్యస్తం
నెట్వర్క్, వెలుగు : ఓరుగల్లు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన వానలకు నగరంలో సుమారు 30 దాకా లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వాగులు, చెరువులు నిండాయి. వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో వరదనీరు ఇండ్లల్లోకి చేరి వస్తువులన్నీ తడవడంతో ఆగ్రహించిన జనాలు ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దామెర మండలంలోని మస్త్యాలపల్లి -తక్కళ్లపాడు మధ్య నాగుల చెరువు వాగు ఉప్పొంగింది. ఐనవోలు మండలం పంతిని సమీపంలో ఆకేరు వాగుతో పాటు చుట్టుపక్కల చెరువు నిండింది.
ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద చలివాగు చెక్ డ్యాం వరద ఉధృతి పెరగడంతో పంటపొలాల్లోకి నీళ్లు చేరాయి. పాకాల చెరువు నీటి మట్టం 21 అడుగులకు చేరింది. మాదన్నపేట పెద్దచెరువు మత్తడి పోసింది. పర్వతగిరి మండలం తురకల సోమారం సమీపంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద వరద నీరు పోటెత్తింది. జమాల్ పురం శివారులో లో లెవల్ వంతెన పై వరద నీరు ప్రహహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రామాలు జలమయం
చెరువులు, కుంటలు నిండడంతో గ్రామాలు జలమయమయ్యాయి. వాగుల మీద బ్రిడ్జీలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గంటల వ్యవధిలోనే వరద నీరు పెరిగిపోయింది. జనం బయటకు రావాలన్నా అవస్థలు పడ్డారు. మరికొన్ని గ్రామాల్లో ఇండ్లల్లోని వరద నీరు చేరుకుంది. స్థానిక లీడర్లు, అధికారులు ప్రమాద స్థలాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ALSO READ :క్రికెట్ స్టేడియంలో ఈతకొట్టిన పాక్ బౌలర్
నెక్కొండ మండలంలోని వెంకటాపురం వద్ద వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా రోడ్డు దాటించారు. ములుగు లో, మహబూబాబాద్లోనూ వర్షం ఆగలేదు. మహబూబాబాద్ లో ఆకేరు , పాలేరు, మున్నేరు , ఈదుల వాగు రావిరాల వాగు, కేసముద్రం
– అర్పన పల్లికి మధ్య వాగులు పొంగుతున్నాయి. పంటలు మునిగాయి.