నీట్ అడ్మిషన్లు పొందిన స్టూడెంట్ల​కు ఇబ్బంది కలిగించం : సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

నీట్ అడ్మిషన్లు పొందిన స్టూడెంట్ల​కు ఇబ్బంది కలిగించం : సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు: నీట్ కౌన్సెలింగ్ ముగిసిందని, ఇప్పటికే కోర్టు ఆదేశాలతో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇబ్బంది కలిగించబోమని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీంతో నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంపై విచారణను కోర్టు నవంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది.

నీట్​కు ముందు నాలుగేండ్లు లోకల్​గా చదవాలని, లేదా నివాసం ఉండాలనే నిబంధనను అందులో చేర్చింది. దీనిపై హైదరాబాద్​కు చెందిన కల్లూరి నాగ నరసింహ అభిరామ్ తోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు విద్యార్థులకు సానుకూలంగా తీర్పు చెప్పింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించాలని స్పష్టం చేసింది. వాటి ఆధారంగానే స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం గత నెల 11న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.