కోర్టుల్లో ఫైల్స్ డిజిటలైజేషన్ చేయాలి : సుజయ్ పాల్

కోర్టుల్లో ఫైల్స్ డిజిటలైజేషన్ చేయాలి : సుజయ్ పాల్
  • హైకోర్టు సీజే​ జస్టిస్ సుజయ్ పాల్

ఎల్బీనగర్/ చేవెళ్ల, వెలుగు: కేసుల సత్వర పరిష్కారానికి అడిషనల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ తెలిపారు. ఎల్బీనగర్​లోని రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి వర్చువల్​గా చేవెళ్లలో అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్ కోర్టు, అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టుతోపాటు రాజేంద్రనగర్​లో మూడో అడిషనల్ జూనియర్ సివిల్, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును శుక్రవారం ఆయన ప్రారంభించారు. అలాగే జిల్లా కోర్టులో విట్నెస్ డిపాజిషన్ సెంటర్​ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. అడిషనల్ కోర్టుల స్థాపనతో కేసుల విచారణ వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజేషన్ వైపు వెళ్తూ కోర్టుల్లో ఫైల్స్ భద్రపర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్ సామ్ కోశి, జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి  శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. 

పక్కా భవనానికి ప్రతిపాదనలు

ఇప్పటివరకు చేవెళ్ల, షాబాద్, శంకర్​పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన వారు ఎల్బీనగర్ లోని  జిల్లా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇక్కడ అదనంగా రెండు కోర్టులు ఏర్పాటు కావడంతో వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న చేవెళ్ల కోర్టు భవనాల సముదాయంలోనే ఈ రెండు కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. త్వరలో పక్కా భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే చేవెళ్ల కోర్టు బార్ అసోసియేషన్ పరిధిలో 190 మంది న్యాయవాదులు నమోదు చేసుకున్నారు. అదనపు కోర్టులు ఏర్పాటు చేయడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.