
- వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రైతు ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వంతో పాటు 23 జిల్లాల కలెక్టర్లకు గురువారం నోటీసులు జారీ చేసింది. జీవో 421 ప్రకారం రైతుల ఆత్మహత్యలపై విచారణ నిమిత్తం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ బి.కొండల్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకల బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు 23 జిల్లాల నుంచి 200కు పైగా దరఖాస్తులు చేసుకున్నాయని తెలిపారు. వీటిని పరిశీలించి, విచారణ చేపట్టాల్సిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని పేర్కొన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన సీఎస్, రెవెన్యూ కార్యదర్శులతో పాటు కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.