గాంధీ ట్రస్ట్ ల్యాండ్ వ్యవహారంలో సర్కార్​కు నోటీసులు

గాంధీ ట్రస్ట్ ల్యాండ్ వ్యవహారంలో సర్కార్​కు నోటీసులు
  • ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సుల్తాన్​బజార్, కోఠిలోని మహాత్మా గాంధీ స్మారక నిధికి ఓ దాత ఇచ్చిన భూమి అన్యాక్రాంతమైందంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర సర్కార్​కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ ఆరాధే, జస్టిస్‌‌ జే.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్‌‌ మండలం పొన్నాల గ్రామంలోని కోఠి గాంధీ స్మారక నిధికి చెందిన భూమి అన్యాక్రాంతం అయ్యిందని అదే గ్రామానికి చెందిన తుపాకుల బాల రంగం మరో నలుగురు హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు.

 ప్రతివాదులుగా సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, భూపరిపాలన ప్రధాన కమిషనర్, సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్​తో పాటు ఇతరులను చేర్చారు. వాదనలు విన్న బెంచ్ రాష్ట్ర సర్కార్​కు నోటీసులు జారీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పొన్నాల గ్రామంలోని సర్వే నంబర్ 241/ఎఎ/బి2/1లో మూడు ఎకరాలు, సర్వే నంబర్ 241/ఎఎ/బి2/2లో 2.34 ఎకరాలను చట్ట విరుద్ధంగా 2022, ఆగస్టు 6న జరిగిన రిజిస్ట్రేషన్‌‌ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. 

గాంధీ సిద్ధాంతాలు, భగవద్గీత బోధనలను ప్రచారం చేసే నిమిత్తం ఒక దాత ట్రస్టుకు ఇచ్చిన భూములను ప్రైవేట్‌‌ వ్యక్తుల పేరుతో రికార్డులు మార్చారని తెలిపారు. భూమి కట్టబెట్టిన జాయింట్‌‌ సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ (తహశీల్దార్‌‌)పై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీనివాసు కొండాయి అనే వ్యక్తికి భూమితో సంబంధం లేని అరిగే శ్రీహరి (రిటైర్డ్ తహసీల్దార్‌‌), హైదరాబాద్‌‌లో ఉండే అరిగె విజయ్‌‌ కుమార్‌‌ రిజిస్టర్‌‌ చేయడం పాత, కొత్త ఆర్‌‌వోఆర్‌‌ చట్ట నిబంధనలకు వ్యతిరేకమని వివరించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు.