రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడ మండల ప్రజాపరిషత్ పాఠశాల మధ్యలో రోడ్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పాఠశాలకు 1,725 చదరపు గజాల స్థలం ఉందని, అయితే పాఠశాల మధ్యలో న్యూ సుభాశ్ నగర్ సంక్షేమ సంఘం వారు రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారని హెడ్‌మాస్టర్ బి.దాసు హైకోర్టుకు లెటర్రాశారు.
పాఠశాల మధ్యలో రోడ్డు వేస్తే పిల్లలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, డీఈఓ, ఎంఈఓ, ఎంపీడీఓ, తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.