- రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని మంగళవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ పట్టా స్థలాల రక్షణకు ఫెన్సింగ్ షీట్ల ఏర్పాటుకు అనుమతించాలంటూ ఇచ్చిన వినతి పత్రాలను అధికారులు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బి. శరణప్పస్వామి మరో 9 మంది హైకోరును ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫెన్సింగ్ ఏర్పాటు నిమిత్తం పిటిషనర్లు చెబుతున్న స్థలం ఎప్టీఎల్ పరిధిలో ఉందని అందువల్ల అనుమతి ఇవ్వలేదని తెలిపారు. హుస్సేన్‌సాగర్ మ్యాప్ ను అందజేశారు. అయితే, ఇందులో స్పష్టత లేకపోవడంతో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.