నమోదు చేసిన వాంగ్మూలాలు సమర్పించండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లలో సేకరించిన వాంగ్మూలాలను తమ ముందుంచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఒక ఘటనపై ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక.. అదే ఘటనపై మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లను ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఎంత మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారో, వాళ్లు ఏం చెప్పారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. లగచర్లలో దాడి ఘటనపై పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. తొలుత పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తర్వాత మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు(154, 155) నమోదు చేశారు.
ఎఫ్‌ఐఆర్ 153లో నిందితులుగా ఉన్న కొందరు రైతులను 154, 155లోనూ నిందితులుగా పేర్కొన్నారు. ఇది టీటీ ఆంటోనీ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమంటూ రైతులు పవార్ నాయక్ మరో నలుగురు హైకోర్టులో సవాలు చేశారు. మరోవైపు ఎఫ్‌ఐఆర్ 145లో నిందితులుగా పేర్కొన్న తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పి.విజయ్ సహా 16 మంది హైకోర్టులో వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. కోర్టుకు వచ్చిన 16 మంది పిటిషనర్లను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.