ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ సమాచారం ఆర్టీఐ ఇవ్వడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ సమాచారం ఆర్టీఐ ఇవ్వడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌పై చేసిన ఫిర్యాదుపై చర్యల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కోరినా అందజేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌‌ట్యాపింగ్‌‌పై 2015లో హోంశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశానని, ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సమాచార హక్కు కింద వివరాలు కోరినా ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఫర్హాత్‌‌ ఇబ్రహీం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌‌ 2015లో హోం శాఖ ముఖ్యకార్యదర్శికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గవర్నర్​కు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. 

ఆ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో, ఒకవేళ విచారణ జరిగినట్లయితే ఏ దశలో ఉందో వివరాలను సమర్పించాలని ఆర్టీఐ కింద అడిగితే నిరాకరించారన్నారు. అప్పీలేట్‌‌ అథారిటీ అయిన డీజీపీ వద్ద అప్పీలు దాఖలు చేస్తే మినహాయింపు ఉందంటూ నిరాకరించారన్నారు. దీనిపై అప్పీలు దాఖలు చేయడానికి సమాచార హక్కు కమిషన్‌‌ పనిచేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.