- హైపవర్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా? జీవో 69 స్టేటస్ ఏంటి?
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరీవాహక ప్రాంతానికి సంబంధించి గతంలో తెచ్చిన 111 జీవో రద్దు, దాని స్థానంలో జారీ చేసిన జీవో 69, హైపవర్ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై స్టేటస్ రిపోర్టు ఎంతవరకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైపవర్ కమిటీ రిపోర్టు ఇచ్చిందో లేదో చెప్పాలని కోరింది.
జీవో 111కు సంబంధించిన దాఖలైన దాదాపు 12 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిన్ అనిల్ కుమార్ల బెంచ్ సోమవారం విచారణ జరిపింది. జీవో 111ను రద్దు చేసి సదరు నిషేధిత ప్రాంతాన్ని పర్యావరణహితంగా అభివృద్ధి చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో69 తీసుకొచ్చింది. అక్కడ తీసుకోవాల్సిన చర్యల కోసం స్టేట్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది.
జీవో 111 రద్దును వ్యతిరేకిస్తూ హైకోర్టులో అప్పటికే పెండింగ్లో ఉన్న పిటిషన్లతోపాటు జీవో 69ని సవాల్ చేస్తూ కొత్త పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. హైపవర్ కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111 రద్దుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోమని గత విచారణ సమయంలో హైకోర్టుకు రాష్ట్ర సర్కార్ హామీ ఇచ్చింది. నిర్మాణాలపై గతంలో ఉన్న ఆంక్షలు, నిషేధాలను సడలించబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. కమిటీ నివేదిక వచ్చేదాకా జీవో రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జీవో 111 కొనసాగుతున్నదని చెప్పారు.
వాదనలు విన్న కోర్టు.. ఇంతకీ కమిటీ నివేదిక ఇచ్చిందా? లేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం కోరిన మేరకు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.