అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ పై విచారణ 24కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. నెల రోజుల్లో అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా తామే విచారిస్తామని సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ సెక్రటరీ వి. నరసింహాచార్యులు అప్పీల్ దాఖలు చేశారు.
దీన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ..తమ అప్పీల్ పై విచారణ పూర్తయ్యేదాకా సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు. నిర్ణీత కాలవ్యవధిలో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తర్వులు ఇచ్చే అధికారం కోర్టులకు లేదని తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ.. అనర్హత పిటిషన్లపై స్పీకర్ కు ఆదేశాలిచ్చే పరిధి హైకోర్టుకు ఉందా? లేదా ?అన్న వివాదంపై తేల్చాల్సి ఉందని పేర్కొంది.
అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ పై ఈ నెల 24న తుది విచారణ చేపడతామని తెలిపింది. ఈ లోగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నట్లయితే కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల24కు వాయిదా వేసింది.