- మోడల్ స్కూల్ టీచర్ల పిటిషన్‌లపై హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించి 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం.. బదిలీలు చేపట్టాలని హైకోర్టు తీర్పు చెప్పింది. బదిలీలకు పాయింట్‌లను లెక్కించే ముందు జాయినింగ్ తేదీని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. సీనియారిటీ జాబితా లేకుండా రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ ఎస్.వెంకట రమేశ్ మరో 14 మంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారించారు.
పిటినర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ..మోడల్ స్కూల్ టీచర్ల బదిలీ మార్గదర్శకాలు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 81కు విరుద్ధమన్నారు. పిటిషనర్లు 2012 నోటిఫికేషన్ ఆధారంగా 2013, 2014ల్లో నియమితులయ్యారని చెప్పారు. పాలనాపరమైన వివాదాల వల్ల కొందరు 16 నెలలు ఆలస్యంగా నియమితులయ్యారని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..విద్యాశాఖ కింద పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ బదిలీ మార్గదర్శకాలను రూపొందించిందన్నారు.
ఇవి జీవో 81కి విరుద్ధం కాదన్నారు. పిటిషనర్లు అందరూ 10 ఏండ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారని, అందరూ బదిలీకి అర్హులేనని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఒకే నోటిఫికేషన్ ఆధారంగా నియమితులైనందున చేరిన తేదీలు, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలతో సంబంధం లేకుండా సీనియారిటీ జాబితాను రూపొందించాలన్నారు.అనంతరం బదిలీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశిస్తూ పిటిషన్‌లపై విచారణను మూసివేశారు.