ప్లాట్ల రిజిస్ట్రేషన్​ను తిరస్కరించడం కరెక్టే

ప్లాట్ల రిజిస్ట్రేషన్​ను తిరస్కరించడం కరెక్టే
  • స్పష్టం చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీరు గ్రామంలో సర్వే నెం.250లో జనచైతన్య హౌసింగ్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు చెందిన మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ను సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ తిరస్కరిండం సబబేనని హైకోర్టు తేల్చి చెప్పింది. శేరిలింగంపల్లి సబ్‌‌రిజిస్ట్రార్‌‌ మూడు సేల్‌‌డీడ్‌‌ల రిజిస్ట్రేషన్‌‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ జనచైతన్య హౌసింగ్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేసింది. జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌ కుమార్‌‌ విచారించారు.

 పిటిషనర్‌‌ తరఫు సీనియర్‌‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. 2004లో వక్ఫ్‌‌బోర్డు సీఈఓ లేఖ ఆధారంగా సర్వే నెం.250లోని భూములను నిషేధిత జాబితాలో ఉంచారని తెలిపారు. మణికొండ జాగీరులోని 1,654 ఎకరాలకు సంబంధించిన వివాదంలో ఇవి వక్ఫ్‌‌ బోర్డుకు చెందవని, ప్రభుత్వానివేనంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు. అలాంటప్పుడు వక్ఫ్‌‌ బోర్డుకు హక్కులు లేని భూమిపై అది రాసిన లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్‌‌ నిలిపివేయడం సరికాదని పేర్కొన్నారు.

 అంతేగాకుండా 2013లో జీహెచ్‌‌ఎంసీ ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ కింద క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని పేర్కొందని, వక్ఫ్‌‌బోర్డుకు హక్కులు లేవన్న కారణంగా ఇక్కడ కంపెనీ హక్కులు కోరదని వెల్లడించారు. ఈ భూములపై హక్కులను నిర్ధారించేలా జనచైతన్య ఎలాంటి పత్రాలను సమర్పించలేదన్నారు. అందువల్ల రిజిస్ట్రేషన్‌‌ చేయాలంటూ ఉత్తర్వులివ్వలేమంటూ జనచైతన్య పిటిషన్‌‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.