నోటీసులిచ్చాక 24 గంటలు కూడా గడువియ్యరా .. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

నోటీసులిచ్చాక 24 గంటలు కూడా గడువియ్యరా .. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
  • వ్యక్తిగతంగా హాజరై కూల్చివేతలపై వివరణ ఇవ్వాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి నోటీసులిచ్చిన తర్వాత 24 గంటల సమయం కూడా ఇవ్వని హైడ్రాపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక కేసులో శనివారం నోటీసిచ్చి ఆదివారం కూల్చివేసిందని వ్యాఖ్యానించింది. ఇది ప్రజా వ్యతిరేకమని, అంతేగాకుండా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. పటాన్‌‌‌‌‌‌‌‌చెరులోని ముతంగిలో షెడ్‌‌‌‌‌‌‌‌ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై, వివరణ ఇవ్వాలంటూ హైడ్రా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌‌‌‌‌చెరు మండలం ముతంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చినా.. దాన్ని పట్టించుకోకుండా తన షెడ్‌‌‌‌‌‌‌‌ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఎ.ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు.

 దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పార్క్‌‌‌‌‌‌‌‌ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన వినతి పత్రాలపై హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసిందన్నారు. దీనిపై భూ మార్పిడి ప్రొసీడింగ్స్, సేల్‌‌‌‌‌‌‌‌ డీడ్, పంచాయతీ అనుమతులతో సహా అన్ని వివరాలను సమర్పించినా.. కూల్చివేత చేపట్టారన్నారు. ఫిర్యాదు చేసిన అసోసియేషన్‌‌‌‌‌‌‌‌తో పాటు పిటిషనర్‌‌‌‌‌‌‌‌ను పిలిచి విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా హైడ్రా కూల్చివేసిందని తెలిపారు. కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌పై కూడా పోలీసు కేసు పెట్టామన్నారు. 

వాదనలను విన్న న్యాయమూర్తి.. పత్రాలు సమర్పించడానికి తగిన గడువు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఒక్కోసారి నోటీసులిచ్చిన మరుసటి రోజే కూల్చివేతలు చేపడుతున్నదని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ముతంగిలో కూల్చివేతలపై వ్యక్తిగతంగా హాజరై, వివరణ ఇవ్వాలంటూ హైడ్రా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.